సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరి కాదని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. షో మొదలవడానికి ముందు జాతీయ గీతాలాపన అనవసరమని తాము భావిస్తున్నట్లు సోమవారం నాడు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియపర్చిన నేపథ్యంలో ధర్మాసనం ఈ మేరకు మంగళవారం ప్రకటన చేసింది.
అయితే థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని.. ఆ సమయంలో అందరూ లేచి నిలబడాలని 2016లో కేంద్రం వేసిన పిటిషన్‌కు సుప్రీం సముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో 2016 నవంబర్ నుంచి థియేటర్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. అయితే దీనిపై పలు విమర్శలు కూడా వినిపించాయి.
జాతీయతను థియేటర్లలో చూపించుకోవాల్సిన అవసరం లేదంటూ పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు. దీనికి తోడు జాతీయ గీతం వచ్చే సమయంలో అన్ని థియేటర్లు నిబంధనలు పాటించడం లేదంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో థియేటర్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించే విషయంపై మళ్లీ యూటర్న్ తీసుకున్న కేంద్రం.. జాతీయ గీతం ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేయొద్దంటూ ఓ పిటిషన్‌ను వేసింది. దీనిపై తాజాగా విచారించిన సుప్రీం, జాతీయ గీతాన్ని తప్పనిసరి కాదంటూ తుది తీర్పునిచ్చింది.