ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన వివాదాస్పద నిబంధనలను పునఃసమీక్షించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిబంధనలపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఈ నిబంధనల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక విషయాలను వెల్లడించారు. యూజీసీ నిబంధనలను మరోసారి పరిశీలించి అవసరమైన మార్పులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు న్యాయస్థానానికి వివరించారు.
అన్ని వర్గాలకు చెందిన విద్యార్థుల ప్రయోజనాలను కాపాడతామని తుషార్ మెహతా హామీ ఇచ్చారు. ఏ ఒక్క వర్గం కూడా అభద్రతకు గురవుతున్నట్లు, అసంతృప్తితో ఉన్నట్లు లేదా వివక్షకు గురవుతున్నట్లు భావించకూడదని పేర్కొన్నారు. విద్యార్థులందరికీ సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నిబంధనలను రూపొందించే సమయంలో ప్రతి విద్యార్థి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. దేశ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Also Read:అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పాదయాత్ర
ఉన్నత విద్యాసంస్థల్లో కుల ఆధారిత వివక్షను అరికట్టడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో అన్ని వర్గాల విద్యార్థుల్లో సమానత్వ భావన, భద్రత ఉండేలా చూడటం కూడా అంతే ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది.

