ప్రముఖ ఆల్కహాలిక్ డ్రింక్ బ్రాండ్ ఓల్డ్ మాంక్కు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విధించిన విక్రయాల నిషేధాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన తయారీ సంస్థ మోహన్ రాకీ స్ప్రింగ్వాటర్ బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా తన పిటిషన్ను వెనక్కి తీసుకుంది. ఉత్పత్తుల లేబుళ్లలో మార్పులు చేసి, అనుమతి కోసం FSSAIకి సమర్పిస్తామని కోర్టుకు వెల్లడించింది.
ఓల్డ్ మాంక్కు చెందిన కొన్ని ఉత్పత్తుల లేబుళ్లు, వాటిపై పేర్కొన్న వివరాలపై FSSAI అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్పత్తుల్లో అదనంగా ఫ్లేవరింగ్ ఏజెంట్లను ఉపయోగిస్తున్నందున వాటిని సాధారణ రమ్గా కాకుండా ‘రమ్ ఫ్లేవర్డ్ స్పిరిట్’గా పేర్కొంటూ విక్రయించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా బాటిళ్లపై ఉన్న ‘7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్’, ‘వెరీ ఓల్డ్ వాటెడ్’ వంటి పదాలపైనా అభ్యంతరాలు తెలిపింది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఖోపోలీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసిన ఓల్డ్ మాంక్కు చెందిన కొన్ని రకాల ఉత్పత్తుల విక్రయాలు, పంపిణీపై FSSAI ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను సవాల్ చేస్తూ తయారీ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అయితే గురువారం ప్రధాన న్యాయమూర్తి మహేశ్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేథ్నాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఉత్పత్తుల లేబుళ్లను సవరించి, ఆమోదం కోసం FSSAIకి సమర్పిస్తామని సంస్థ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
Also Read:అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పాదయాత్ర
అంతకుముందు విక్రయాలపై నిషేధం కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.350 కోట్ల ఎక్సైజ్ ఆదాయం నష్టం వాటిల్లిందని సంస్థ వాదించింది. అయితే FSSAI ఆదేశాలపై మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో కేసును మెరిట్స్ ఆధారంగా కొనసాగించకూడదని నిర్ణయించుకున్న సంస్థ తన పిటిషన్ను ఉపసంహరించుకుంది. అనంతరం కోర్టు ఈ వ్యవహారాన్ని ముగించింది. తాజా పరిణామంతో ఓల్డ్ మాంక్ ఉత్పత్తుల లేబుళ్లలో మార్పులు చేయడం, వాటికి FSSAI అనుమతి పొందడం తదుపరి కీలక అంశాలుగా మారాయి.

