సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలని భావిస్తుంటారు. బరువు నియంత్రణ, మెటబాలిక్ ఆరోగ్యం కోసం లో-కార్బ్ డైట్స్‌ను అనుసరించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే సరైన ఆహార పదార్థాల నుంచి కార్బోహైడ్రేట్లను తీసుకుంటే శరీరంలోని వృద్ధాప్యానికి సంబంధించిన కొన్ని సూచికలు మెరుగుపడవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. తక్కువ కొవ్వు, ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకున్న వృద్ధుల్లో కేవలం నాలుగు వారాల్లోనే బయోలాజికల్ ఏజ్‌కు సంబంధించిన సూచికల్లో మెరుగుదల కనిపించింది.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎక్కువ చక్కెర, మైదా లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తినాలని పరిశోధకులు సూచించడం లేదు. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి పోషకాలు అధికంగా ఉండే సహజ ఆహార పదార్థాలపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. అంతేకాకుండా ఆహారంతో వృద్ధాప్యాన్ని శాశ్వతంగా వెనక్కి తిప్పవచ్చని ఈ పరిశోధన నిరూపించలేదు.
ఈ పరిశోధనలో 65 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న 104 మంది పెద్దల ఆరోగ్య వివరాలను విశ్లేషించారు. వీరిని నాలుగు గ్రూపులుగా విభజించి నాలుగు వారాల పాటు నాలుగు రకాల ఆహార విధానాలను అనుసరించేలా చేశారు.
అధిక కొవ్వు ఉండే మాంసాహార ఆహారం.
అధిక కార్బోహైడ్రేట్లు ఉండే మాంసాహార ఆహారం.
అధిక కొవ్వు ఉండే సెమీ వెజిటేరియన్ ఆహారం.
అధిక కార్బోహైడ్రేట్లు ఉండే సెమీ వెజిటేరియన్ ఆహారం.
ఈ నాలుగు గ్రూపుల్లోనూ మొత్తం శక్తిలో 14 శాతం ప్రొటీన్ల నుంచి వచ్చేలా ఆహారాన్ని రూపొందించారు. వీటిలో తక్కువ కొవ్వు, అధిక కార్బోహైడ్రేట్లు ఉండే మాంసాహార ఆహారం తీసుకున్న గ్రూపులో అత్యధిక మెరుగుదల కనిపించింది.
ఈ గ్రూపు ఆహారంలో సుమారు 53 శాతం కార్బోహైడ్రేట్లు, 28 నుంచి 29 శాతం కొవ్వు, 14 శాతం ప్రొటీన్లు ఉన్నాయి. అధిక కొవ్వు ఉన్న మాంసాహార ఆహారం తీసుకున్న గ్రూపులో బయోలాజికల్ ఏజ్ అంచనాలో చెప్పుకోదగిన మార్పు కనిపించలేదు. ఇతర మూడు గ్రూపుల్లోనూ కొంత మెరుగుదల నమోదైంది.
అధిక కార్బోహైడ్రేట్ల ఆహారం తీసుకున్న గ్రూపు, అధిక కొవ్వు ఆహారం తీసుకున్న గ్రూపుతో పోలిస్తే బయోలాజికల్ ఏజ్ అంచనాలో సుమారు 3.5 నుంచి 4 సంవత్సరాల తేడా కనిపించింది. అయితే నెల రోజుల్లోనే నిజంగా నాలుగేళ్లు చిన్నవారిగా మారారని దీని అర్థం కాదు.
అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రేట్ల పరిమాణంతో పాటు వాటి నాణ్యత కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా కింది ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేయవచ్చు.
తృణధాన్యాలు: ఓట్స్, బార్లీ, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి వాటిలో కార్బోహైడ్రేట్లతో పాటు ఫైబర్, ఇతర పోషకాలు ఉంటాయి.
Also Read:అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పాదయాత్ర
పప్పుధాన్యాలు: బీన్స్, కందిపప్పు, శనగలు వంటి వాటిలో కార్బోహైడ్రేట్లు, మొక్కల ఆధారిత ప్రొటీన్లు, ఫైబర్ లభిస్తాయి.
పండ్లు: తాజా పండ్లలో సహజమైన కార్బోహైడ్రేట్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి.
కూరగాయలు: వివిధ రకాల కూరగాయలు ఫైబర్‌తో పాటు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలను అందిస్తాయి.
ఈ ఆహార పదార్థాల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సహాయపడుతుంది.

