దేశ వ్యాప్తంగా బిల్కిస్ బానో రేప్ కేసు నిందితుల్ని రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది. బిల్కిస్ బానో రేప్ చేసిన వారిని విడుదల చేసిన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 11 మంది నిందితుల రిలీజ్ గురించి వివరణ ఇవ్వాలంటూ గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పంద్రాగాస్టు రోజున బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ ప్రభుత్వ తీరును విపక్షాలు ఖండిస్తూ నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. నిందితుల విడుదల గురించి వివరణ ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది.
2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. ఆ కేసులో 11 మంది నిందితులుగా ఉన్నారు. 2008న ప్రత్యేక సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్ధించింది. దోషులు 15ఏళ్లు కారాగారంలో గడిపారు అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఒకరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసుల్లో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్స్ చేశారు. ఈ మేరకు విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు తెలిపారు.