మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నామినేషన్ల ఉపసంహరణకు గురువారమే చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ వ్యక్తం చేసిన ఆందోళనల మధ్య సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
మధ్యప్రదేశ్ నుండి జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. అయితే, తన నామినేషన్ పత్రాల తిరస్కరణను సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించడానికి న్యాయస్థానం అంగీకరించింది.
ఎన్నికల ఫలితాల ప్రకటనను అడ్డుకుంటూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్ లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ అశోక్ కుమార్ (2000) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉందని…ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సాధారణంగా కోర్టులు అందులో జోక్యం చేసుకోకూడదని ధర్మాసనం పేర్కొంది.
నటరాజన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. ఫలితాల ప్రకటనను నిలిపివేయాలని అత్యవసర మధ్యంతర ఉత్తర్వులను కోరగా క్షమించండి, మేము అలా చేయలేము…. లోపాలన్నింటినీ సరిచేసిన తర్వాత ఈ పిటిషన్‌ను రేపటికి (శుక్రవారం) వాయిదా వేస్తున్నాము అని ధర్మాసనం స్పష్టం చేసింది.
నామినేషన్ల ఉపసంహరణకు గురువారమే చివరి రోజు కావడంతో నటరాజన్ అభ్యర్థిత్వం ఇప్పటికే తిరస్కరణకు గురైనందున.. గడువు ముగిసిన వెంటనే బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సింఘ్వీ కోర్టులో వాదిస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33A ప్రకారం వివరాల వెల్లడికి సంబంధించిన తీవ్రమైన చట్టపరమైన అంశం ఇందులో ముడిపడి ఉందని అన్నారు. సెక్షన్ 33A అనేది పోటీ చేసే అభ్యర్థుల క్రిమినల్ నేపథ్యాన్ని ఓటర్లు తెలుసుకునే హక్కుకు సంబంధించినది. కోర్టు ఎలాంటి నేరాన్ని పరిగణనలోకి తీసుకోకపోయినప్పటికీ నా నామినేషన్‌ను తిరస్కరించారు. వారు అలా ఎలా చేయగలరు? అని సింఘ్వీ ప్రశ్నించారు. నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు ప్రాతిపదికగా చూపిన సదరు క్రిమినల్ ఫిర్యాదును కోర్టు ఇంకా స్వీకరించే స్థాయికి చేరుకోలేదని ఆయన వాదించారు.
రిటర్నింగ్ అధికారి ముందు నటరాజన్ నామినేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన బీజేపీ నేతల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈ అత్యవసర ప్రస్తావనను వ్యతిరేకించారు. భారత ఎన్నికల సంఘం (ECI) తరపున హాజరైన సీనియర్ న్యాయవాది డి.ఎస్. నాయుడు వాదిస్తూ.. ఈ పిటిషన్ కాపీలు ఇంకా కమిషన్‌కు అందలేదని అసలు ఈ పిటిషన్ ఇక్కడ విచారణకు అర్హమైనది కాదని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన పరిష్కారం ఇక్కడ లేదు ..మరెక్కడో ఉందని ఆయన అన్నారు.
Also Read:సుప్రీంకు మీనాక్షి నటరాజన్
అయితే ఎన్నికల విషయాలలో న్యాయవ్యవస్థ జోక్యంపై చట్టపరమైన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని ధర్మాసనం పునరుద్ఘాటించింది. అశోక్ కుమార్ కేసులో చట్టం స్పష్టంగా చెప్పబడింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు, కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోలేవు అని ధర్మాసనం పేర్కొంది. మధ్యంతర ఉపశమనాన్ని నిరాకరిస్తూనే ఈ వ్యవహారాన్ని శుక్రవారం విచారణకు జాబితా చేయడానికి కోర్టు అంగీకరించింది.

