ప్రముఖ బుల్లితెర యాంకర్, నటి మల్లిక ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 39 ఏళ్ళ మల్లిక గత 20 రోజులుగా బెంగుళూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాల ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. సుమతో పాటు బుల్లితెర యాంకర్‌గా కెరియర్ ప్రారంభించిన మల్లిక 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తరువాతి కాలంలో పలు సినిమాల్లో సైతం నటించారు మల్లిక. మహేష్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’లో నటించి ఆకట్టుకుంది. యాంకర్‌గా పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. మల్లిక స్వస్థలం హైదరాబాద్ నారాయణగూడా కాగా.. వివాహం అనంతరం బెంగుళూరుకు వెళ్లారు. ఆ తరువాత నటనకూ యాంకరింగ్‌కూ దూరమయ్యారు. యాంకర్‌గా టాప్ స్థానంలో ఉన్న సుమ, ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
మల్లిక మరణంపై సుమ తన ఫేస్ బుక్ పేజీలో స్పందిస్తూ.. ”యాంకర్ మల్లిక ఇకలేదు. ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది. ఆమె మన మధ్య లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..” అంటూ సుమ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.