నూతన దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్ రెడ్డి’ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. యువ ప్రేక్షకులు, విమర్శకుల నుండి ఉత్తమమైన ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఈ ఏడాది తెలుగు పరిశ్రమ అందుకున్న విజయాల్లో ఒకటిగా నిలిచింది. బలమైన కథాంశం, ఆకట్టుకునే కథానాయకుడి పాత్ర, దర్శకుడు దాన్ని తెరపై మలచిన తీరు, అందులో విజయ్ దేవరకొండ నటన అన్నీ అద్భుతంగా కలిసి సినిమాను గొప్పగా తీర్చిదిద్దాయి. చిత్రాన్ని ఇప్పటికే పలుసార్లు థియేటర్లలో వీక్షించిన చాలా మట్టుకు యువత టీవీ ప్రీమియర్ కోసం ఎదురుచూస్తున్నారు.
అర్జున్ రెడ్డి సినిమా హిట్. కానీ శాటిలైట్ విషయంలో మాత్రం చాలా లేట్. దీనికి కారణం సినిమా కంటెంట్. టీవీల్లో ప్రసారం చేయాలంటే సినిమాలో చాలా సన్నివేశాలు తొలిగించాలి, మరెన్నో డైలాగ్స్ మ్యూట్ చేయాలి. అందుకే మొన్నటివరకు చర్చలు జరిపిన జీ తెలుగు ఛానెల్ వెనక్కి తగ్గింది. మేకర్స్ చెప్పిన రేటు ఓకే అయినా కంటెంట్ పరంగా ఇబ్బందులొచ్చి సదరు ఛానెల్ తప్పుకుంది. ఇప్పుడీ సినిమాను స్టార్ మా టేకోవర్ చేసింది.
దాదాపు జీ తెలుగు ఛానెల్ ఫిక్స్ చేసిన మొత్తానికే (దాదాపు మూడున్నర కోట్లు) స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. అంతేకాదు.. వీలైనంత తొందరగా ఈ సినిమాను ప్రసారం చేయాలని నిర్ణయించింది. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ వంగ నిర్మించిన ఈ చిత్రంలో షాలిని పాండే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసే ప్రయత్నాలు కూడా ఊపందుకున్నాయి.