లాక్ డౌన్ అమలు తీరుపై స్పీకర్ పోచారం సమీక్ష..

143
Speaker Pocharam
- Advertisement -

బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు హైదరాబాద్ లోని తన అధికార నివాసం నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి వీడియో కాల్ లైవ్ ద్వారా సంభాషించారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

గ్రామాలలో త్రాగునీటి సరఫరాపై ప్రజాప్రతినిధుల నుండి వివరాలను తెలుసుకున్న స్పీకర్ పోచారం అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాలలో మిషన్ భగీరద అంతర్గత పైప్ లైన్ లలో సమస్యలతో ఇంటింటికీ త్రాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి లోటుపాట్లను సవరించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా వేసవికాలం పూర్తికానందున సమస్యను త్వరితంగా పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులకు అవసరమైన సహాయసహకారాలు అందించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న లాక్ డౌన్ అమలు తీరుపై స్పీకర్ సమీక్షించారు. కోటగిరి మండలం మహారాష్ట్రతో సరిహద్దులు కలిగి ఉన్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విదించిన లాక్ డౌన్‌తో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాయన్నారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలలో కూడా లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. కరోనా కట్టడి విషయంలో ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ లాక్ డౌన్‌కు సహకరించాలని సభాపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా వచ్చే వానాకాలం పంటల సాగు సన్నద్దతపై సూచనలను అందజేశారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను అవసరమైన మేరకు ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై స్పీకర్ వివరాలను తెలుసుకున్నారు. లబ్దిదారులకు అవసరమైన సామాగ్రిని అందజేయాలని, త్వరితంగా నిర్మాణాలు పూర్తి అయ్యేవిదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిదంగా గ్రామాలలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం తెలుసుకుని తగు సూచనలను చేశారు.

- Advertisement -