వారణాసిలో ఎస్పీ హవా

7
- Advertisement -

ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారణాసి, ఆగ్రా స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన కార్యకర్తలకు కీలక సూచన చేశారు. విజయోత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, అల్లర్లు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపణలు చేసే అవకాశం ఇవ్వొద్దని కోరారు.

ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వారణాసి ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్ విజయం సాధించినట్లు సమాచారం వెలువడింది. ఆగ్రా స్థానంలోనూ ఎస్పీ అభ్యర్థి ఆకాశ్ అగర్వాల్ విజయంపై పార్టీ నేతలు ప్రకటనలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ కార్యకర్తలకు సంయమనం పాటించాలని సూచించారు.

ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు తావివ్వకూడదని, పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతియుతంగా సంబరాలు జరుపుకుంటే ప్రత్యర్థులు అల్లర్లకు సంబంధించిన ఆరోపణలు చేసే అవకాశం ఉండదని పేర్కొన్నారు.

మరోవైపు, ఆగ్రా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎస్పీ అభ్యర్థి ఆకాశ్ అగర్వాల్‌తో దురుసుగా వ్యవహరించారని, దాడి చేశారని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలని కోరారు. ఆకాశ్ అగర్వాల్‌కు విజయ ధ్రువీకరణ పత్రం వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కూడా ఈ ఘటనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:జియో ఐపీవోపై అంబానీ

- Advertisement -