ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో 2020 నుంచి ఇప్పటివరకు ఆడిట్ నిర్వహించకపోవడంపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా ఆడిట్ జరగకపోవడం చాలా తీవ్రమైన విషయమని పేర్కొంది. ఈ వ్యవహారంలో బాధ్యులైన యూనివర్సిటీ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో వివరించాలని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
విశ్వవిద్యాలయాలు నాగరికతకు పునాదులని, అక్కడ చదువుకునే విద్యార్థులే దేశ భవిష్యత్తు అని జస్టిస్ విక్రమ్ డి. చౌహాన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి విద్యాసంస్థలు అత్యంత పారదర్శకత, నిజాయతీతో పనిచేయాలని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో ఆడిట్ జరగడం లేదనే విషయం బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి వచ్చింది.
2026 ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టిన కొత్త వైస్ ఛాన్సలర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి, సమగ్ర ఆడిట్‌తో పాటు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరినట్లు కోర్టుకు వివరించారు. ఆడిట్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని యూనివర్సిటీ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా అంగీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, ప్రజాధనం ద్వారా విశ్వవిద్యాలయాలు నిధులు పొందుతాయని కోర్టు గుర్తుచేసింది. ఆ నిధులు నిర్దేశించిన ప్రయోజనాలకే వినియోగిస్తున్నారా లేదా దుర్వినియోగం అవుతున్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా ఆడిట్ జరగాలని పేర్కొంది. 2020 నుంచి ఆడిట్ నిర్వహించకపోతే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైన అధికారులతో పాటు, అవసరమైతే గత వైస్ ఛాన్సలర్‌పైనా చర్యలు తీసుకోవాల్సిందని వ్యాఖ్యానించింది.
Also Read:ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ పంజా..
గత ఐదేళ్లలో ఆడిట్ నిర్వహించకపోవడానికి బాధ్యులైన ప్రస్తుత, గత అధికారులపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి కంటే తక్కువ కాని అధికారితో అఫిడవిట్ సమర్పించాలని సూచించింది. 2020 నుంచి ఆడిట్ కోసం ప్రభుత్వం యూనివర్సిటీకి ఇచ్చిన ఆదేశాల వివరాలను కూడా సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది.

