జియో ఐపీవోపై అంబానీ

5
- Advertisement -

జియో ప్లాట్‌ఫామ్స్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందన తమ అంచనాలను మించిపోయిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు. తన సోదరుడు అనంత్ అంబానీ, సోదరి ఇషా అంబానీలతో కలిసి జియోను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

బుధవారం జరిగిన లిస్టింగ్ కార్యక్రమంలో ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. రాబోయే పదేళ్లలో భారతీయుల జీవితాలను మార్చగల సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. అంతరిక్షం నుంచి కనెక్టివిటీ సేవలను అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

జియో వృద్ధి, పనితీరు, నాణ్యతను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఆకాశ్ అంబానీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన తల్లిదండ్రులు ముకేశ్ అంబానీ, నీతా అంబానీలతో పాటు సోదరి ఇషా, సోదరుడు అనంత్, నాయనమ్మ కోకిలాబెన్ అంబానీ హాజరయ్యారు.

జియో ప్లాట్‌ఫామ్స్ కేంద్రంగా డిజిటల్ సమాజాన్ని నిర్మించాలన్నది తమ ఆకాంక్ష అని ఆకాశ్ తెలిపారు. కనెక్టివిటీ, కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికతలు సమన్వయంతో పనిచేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

Also Read:షారుఖ్ ‘కింగ్‌’ కాపీనా?

తమకు వారసత్వంగా లభించిన సంస్థను కాపాడుకోవడం మాత్రమే అంబానీ కుటుంబ తదుపరి తరం బాధ్యత కాదని, జియోను మరింత పెద్దదిగా, మెరుగైనదిగా తీర్చిదిద్ది భారతదేశానికి మరింత ఉపయోగపడే సంస్థగా అభివృద్ధి చేయాలని ఆకాశ్ అంబానీ అన్నారు.

- Advertisement -