ల‌వ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో సౌర‌వ్ గంగూ బ‌యోపిక్‌..

81
Ganguly biopic

టీంఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ జీవిత‌చ‌రిత్ర ఆధారంగా ఓ మూవీ తెర‌కెక్క‌నుంది. ల‌వ్ ఫిల్మ్స్ ఈ మూవీని తెర‌కెక్కించ‌నుంది. భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించిన దిగ్గజం సౌరవ్ గంగూలీ. ఆటగాడిగా, కెప్టెన్ గా జట్టుకు దూకుడు నేర్పిన ఈ బెంగాల్ టైగర్ జీవితం ఆధారంగా రానున్న సినిమాపై అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

గ‌తంలో త‌న బ‌యోపిక్‌కు దాదా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాను తామే నిర్మిస్తున్నట్లు ల‌వ్ ఫిల్మ్స్ గురువారం ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఇది త‌మ‌కు గొప్ప గౌర‌వ‌మ‌ని, గ్రేట్ ఇన్నింగ్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పింది. అటు దాదా కూడా త‌న బ‌యోపిక్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. త‌న జీవితంలో క్రికెటే స‌ర్వ‌స్వ‌మ‌ని, తాను త‌లెత్తుకొని జీవించ‌డానికి అవ‌స‌ర‌మైన ఆత్మ‌విశ్వాసాన్ని ఈ గేమే త‌న‌కు అందించింద‌ని దాదా అన్నాడు.

కాగా, గంగూలీ క్రికెట్ జీవితంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ కావలసినంత డ్రామా ఉంది. గతంలో ఓ సినీ తారతో ప్రేమాయణం నడిపినట్టు ఇటు క్రికెట్ లోకం, అటు సినిమా ప్రపంచంలో తీవ్రంగా ప్రచారం జరిగింది. మరోవైపు, తన చిన్ననాటి స్నేహితురాలు డోనాను ప్రేమించి పెళ్లి చేసుకోవడం గంగూలీ కెరీర్ లో మరో ముఖ్యఘట్టం. ఈ లవ్ ఎపిసోడ్ ఏ సినిమా కథకు తీసిపోదు.

ఇక, లార్డ్స్ మైదానంలో చొక్కా విప్పి గిరగిరా తిప్పడం, ఆసీస్ దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా అంతటివాడిని టాస్ సమయంలో తనకోసం వేచిచూసేలా చేయడం గంగూలీ కెరీర్ లో కొన్ని ముఖ్యాంశాలు. ఆటపరంగా చూస్తే రికార్డులు, ఘనవిజయాలు ఎన్నో గంగూలీని విశిష్ట వ్యక్తిగా మలిచాయి. ఈ నేపథ్యంలో గంగూలీ బయోపిక్ లో ఏమేం అంశాలు ఉంటాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.