తనకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్లా అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సిరిసిల్లకు వచ్చిన కేటీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సిరిసిల్లను తెలంగాణలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
రాబోయే మూడేళ్లలో సిరసిల్లలో రైలు కూత వినిపిస్తుందన్నారు. ప్రతి ఇంటికీ మంచినీరు అందించి తీరుతానని తెలిపారు. ఇప్పటివరకు సిరిసిల్లలో 25 శాతం మాత్రమే అభివృద్ధి జరిగిందని మిగిలిన 75 శాతం అభివృద్ధి కూడా పూర్తిచేసే బాధ్యత తనదేనన్నారు.
సిరిసిల్ల ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పారు కేటీఆర్. ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా సిరిసిల్లను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం అభివృద్ధిలో ముందుకుసాగుతానని చెప్పారు.బతుకమ్మ చీరలను ఇవాళ్టి నుండే పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు.
నేతన్నల బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. తనకు అపూర్వ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.టీఆర్ఎస్‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టడమే తన ముందుకున్న కర్తవ్యమన్నారు.