సమిష్టి కృషే సింగరేణి విజయాలకు ప్రధానకారణం: సీఎండీ శ్రీధర్‌

338
Singareni
- Advertisement -

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ రాష్ట్రంలోనే కాక దేశంలోని మహారత్న కంపెనీలకు సమానంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు సమస్త సింగరేణీయుల సమిష్టి కృషే ప్రధాన కారణమని సింగరేణి ఛైర్మన్‌&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ అన్నారు. శిక్షణలో ఉన్న 2018వ బ్యాచ్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారులతో హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌లో బుధవారం నాడు జరిగిన సమావేశంలో ఆయన సింగరేణి సాధిస్తున్న ప్రగతిని వివరించారు.

ఈ ఐ.ఎ.ఎస్‌. అధికారులు తమ శిక్షణా కాలంలో భాగంగా తెలంగాణా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అసిస్టెంట్‌ కలెక్టర్లుగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణలో భాగంగా సింగరేణి సంస్థను సందర్శిస్తూ సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ సింగరేణి సంస్థ గత ఐదేళ్ల కాలంలో సాధించిన విజయాలను స్ఫూర్తిదాయకంగా వివరించారు. ఏటా 660 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి ద్వారానే కాక 1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తితో కూడా దేశాభివృద్ధికి తోడ్పడుతోందని వివరించారు. 129 సంవత్సరాల చరిత్ర గల సింగరేణి గత ఐదేళ్ల కాలంలో మునుపెన్నడూ లేనంత స్థాయిలో వృద్ధి చెందిందనీ, లాభాలలో 282 శాతం వృద్ధిని, టర్నోవర్‌ లో 117 శాతం వృద్ధిని సాధించి దేశంలోని 8 మహారత్న కంపెనీలకు సాటిగా నిలిచిందని ఆయన వివరించారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు జరుపుతున్నామన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌రావు సింగరేణి ఉద్యోగులు, కార్మికుల పట్ల గల అభిమానంతో పలు సంక్షేమ పథకాలు అమలు జరిపారనీ, ఫలితంగా రాష్ట్రాభివృద్ధి కోసం సింగరేణి కార్మికులు, అధికారులు సమిష్టిగా కృషి చేస్తూ ప్రతీ ఏటా ఇచ్చిన లక్ష్యాలు సాధిస్తూ వస్తున్నారని వివరించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు అంకితభావంతో కృషిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆయన ట్రైనీ ఐ.ఎ.ఎస్‌.లకు సోదాహరణంగా వివరించారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 22వ తేదీన ఐ.ఎ.ఎస్‌. అధికారుల బృందం శ్రీరాంపూర్‌ ఏరియాలోని భూగర్భ గనులు, ఓ.సి. గనులను సందర్శించింది. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను ఈ బృందం పరిశీలించింది.

- Advertisement -