టాలీవుడ్‌ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. తొలిరోజు దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు రెండో రోజు సినిమాటోగ్రఫర్ శ్యాం కె నాయుడుని విచారించారు. ఈ ఉదయం నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో సిట్ అధికారుల బృందం ఈ ఉదయం 10.30 గంటల నుంచి పలు దఫాలుగా విచారించారు. సాయంత్రం 4గంటల వరకు విచారించిన అధికారులు ఆయన ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. కెల్విన్ ముఠాకు సంబంధించిన వివరాలు, మాదకద్రవ్యాలు కెల్వినే సరఫరా చేసేవాడా? లేదంటే దళారులతో సరఫరా చేసేవాడా? లాంటి ప్రశ్నల్ని అడిగినట్టు తెలుస్తోంది. కెల్విన్‌తో ఇతరులకు ఉన్న సంబంధాలపై ఆయన స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం కొద్దిసేపటి క్రితమే శ్యామ్ కె.నాయుడు సిట్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు.
తమ అనుమతి లేకుండా హైదరాబాద్ వదలి వెళ్లొద్దని సిట్ అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరో మారు విచారణకు హాజరుకావాలని శ్యాం కె నాయుడుకి అధికారులు చెప్పినట్టు సమాచారం. పూరికి అత్యంత సన్నిహితుల్లో శ్యామ్ ఒకరు. తొలుత ఈ రోజు (జూలై 20వ తేదీ) నటి చార్మీని విచారించాల్సి ఉంది. శ్యామ్ కె నాయుడును ఈ నెల 23న విచారించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా శ్యామ్ కె నాయుడును అధికారులు ఈ రోజు పిలిచారు. చార్మీని 26వ తేదీన విచారిస్తారని సమాచారం. కాగా, డ్రగ్స్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని, నోటీసులు అందుకున్న వారు విచారణకు సహకరించాలని కోరుతున్నామని ఎక్సైజ్ కమిషనర్ చంద్ర వదన్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఆధారాలు లభిస్తే ఎవరిపైన అయినా సరే, చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.