కాల్పుల డ్రామా కోసం రూ.50లక్షలు

230
Shooting case: Vikram Goud arrest
- Advertisement -

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల మిస్టరీ వీడింది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. తనపై కాల్పులు జరపాలని విక్రమ్ సుపారీ ఇచ్చాడని నిర్థారించారు పోలీసులు. దీంతో వారం రోజుల మిస్టరీకి తెర పడింది. శరీరంలోకి రెండు బుల్లెట్లు బయటకు తీయటంతోపాటు అపోలో ఆస్పత్రిలో కోలుకున్న విక్రమ్ ను అరెస్ట్ చేశారు.అప్పులు తీర్చేందుకు, రాజకీయ లబ్ధి కోసం విక్రమ్ కాల్పుల డ్రామా ఆడినట్లు గుర్తించారు.

తనపై కాల్పుల ఘటనలో కథ, స్క్రీన్ ప్లే అంతా విక్రమ్ గౌడ్‌దే. ఇందులో మొత్తం 11 మంది పాత్రదారులు ఉన్నారు. ఇప్పటికి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఏ1 విక్రమ్, ఏ2 షూటర్ నందు, ఏ3 అహ్మద్ ఖాన్, ఏ4 రాజు, ఏ5 మురళి, ఏ6 రాజశేఖర్.  వీరిపై 120, 120(బి) ఆయుధాల చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

తనపై కాల్పులు జరపాలని సుపారీ ఇచ్చాడు విక్రమ్. ఓ షూటర్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. మూడు రౌండ్లు కాల్చాలని.. అయితే ప్రాణాలు పోకూడదని చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే షూటర్ నందు డీల్ కు ఓకే అన్నాడు. అర్థరాత్రి తర్వాత ఇంట్లోకి వచ్చిన షూటర్ నందు, ఇతరులు రెండు రౌండ్లు మాత్రమే కాల్పులు జరిపారు. వెళ్తూ వెళ్తూ తుపాకీని షేక్ పేట్  నాలాలో పడేశారు. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత షూటర్ నందు ఇండోర్ పారిపోయాడు. మరో ఇద్దరు నిందితులు ఏపీలోని అనంతపురం వెళ్లారు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ కాల్పుల కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రణాళిక నాలుగు నెలల క్రితమే రూపొందించినట్టు తెలిపారు. ఘటన అనంతరం నిందితుల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తృత గాలింపులు చేపట్టినట్టు తెలిపారు. విక్రమ్‌తో కలిపి ఆరుగురు నేరస్థులు తమ కస్టడీలో ఉన్నట్టు చెప్పారు. గాయ పరచుకుంటే తన నియోజకవర్గంలో సానుభూతి వస్తుందని విక్రమ్‌గౌడ్‌ భావించారనీ, తనతో ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యక్తులపై ఒత్తిడి వస్తుందనుకున్నాడని చెప్పారు. ఈ ప్రణాళిక అమలులో భాగంగా గోవిందరెడ్డికి రూ.5లక్షలు చెల్లించినట్టు చెప్పారు. పని పూర్తయ్యాక మరో రూ.50లక్షలు ఇస్తానని విక్రమ్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడని సీపీ తెలిపారు.

2016 గ్రేటర్ ఎన్నికల్లో విక్రమ్ గౌడ్ పోటీ చేశారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో రూ.6.5 లక్షల నగదు, ఫార్చునర్ వాహనంతో పాటు తన ఆస్తిని రూ.37.70 లక్షలుగా చూపించాడు. భార్య పేరిట 56,12,500 చూపించాడు. అందులో 2 కిలోలకు పైగా బంగారం. ఇవి కాకుండా భార్య చేతిలో రూ.5.50 లక్షలు చూపించాడు. ఇవి తప్ప తన వద్ద స్థిర, చరాస్తులు ఏమీ లేవని పేర్కొన్నాడు.

- Advertisement -