ఆఫ్రిది…బూమ్‌..బూమ్‌

217
Shahid Afridi smashes 42 ball century
- Advertisement -

పాక్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది చాలాకాలం తర్వాత తన బ్యాట్‌కు పని చెప్పాడు. ఫామ్ లేమితో ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆఫ్రిది….ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సత్తాచాటుతున్నాడు. నార్త్‌వెస్ట్‌ టీ20 బ్లాస్ట్‌లో రికార్డుల మోత మోగించాడు. హ్యాంప్‌షైర్‌-డెర్బిషైర్‌ మధ్య జరిగిన తొలి క్వార్టర్‌ఫైనల్లో అఫ్రిది టీ20ల్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు.

కేవలం 42 బంతుల్లో సెంచరీ సాధించి ప్రత్యర్ధి జట్టుకు ముచ్చెమటలు పోయించాడు. టీ20ల్లో అఫ్రిదికి ఇదే తొలి సెంచరీ. ఈ మ్యాచ్‌లో మొత్తం 43 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్స్‌ల సాయంతో 101 పరుగులు సాధించాడు. అఫ్రిది అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శనతో హ్యాంప్‌షైర్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 249 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన డెర్బిషైర్‌ జట్టు 19.5 ఓవర్లలోనే కుప్పకూలింది. దీంతో హ్యాంప్‌షైర్‌ జట్టు 101 పరుగుల తేడాతో విజయం సాధించింది.

1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అఫ్రిది.. తానాడిన రెండో వన్డెలోనే శ్రీలంకపై కేవలం 37 బంతుల్లో సెంచరీ సాధించి ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాడు. టెస్ట్‌ కెరీర్‌లో 27 మ్యాచ్‌ల్లో 1,176 పరుగులతో పాటు, 48 వికెట్లు సాధించిన అఫ్రిది.. వన్డేల్లో 398 మ్యాచ్‌ల్లో 8,064 పరుగులు, 395 వికెట్లు సాధించాడు. ఇక టీ20 పార్మాట్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 1,405 పరుగులు, 97 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

- Advertisement -