గబ్బర్…నీ మణికట్టును కోరేవాడు..!

292
Sehwag’s ‘Sholay’ wishes to birthday-boy Laxman
- Advertisement -

మణికట్టుతో మ్యాజిక్ చేస్తూ.. కళాత్మక బ్యాటింగ్‌తో భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఎదిగాడు. సచిన్, ద్రవిడ్, గంగూలీతో కలిసి భారత బ్యాటింగ్ చతుష్టయంలో ఒకడిగా.. జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడం చాలా తేలికంటూ ఇతర బ్యాట్స్‌మెన్‌కు మార్గనిర్దేశనం చేసి కంగారులను పరుగెత్తించాడు వెరీ వెరీ స్పెషల్ వీవీఎస్ లక్ష్మణ్  .

VVS Laxman

136 టెస్టుల్లో తన అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన వీవీఎస్..మంగళవారం 42వ పుట్టినరోజును జరుపుకున్నారు. లక్ష్మణ్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌మేట్స్‌, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘వంగిపురపు వెంకట సాయి గారు… మీరు గనక షోలే సినిమాలో నటించి ఉంటే.. యే కలాయి హమ్‌క దే దే (ఈ మణికట్టు నాకు ఇచ్చెయ్‌) లక్ష్మణ్‌ అని గబ్బర్‌ అని ఉండేవాడ’ని సెహ్వాగ్‌ సరదాగా రాశాడు. ‘హ్యాపీ బర్త్‌డే లచ్చి’ అని దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌ చేశాడు. ‘మంచి టీమ్‌మేట్‌.. దేశం కోసం ఏదో ఒక ప్రత్యేకం చేయాలని అనుకుంటూ ఉండేవాడ’ని మాస్టర్‌ రాశాడు. కోచ్‌ అనిల్‌ కుంబ్లే, యువరాజ్‌ సింగ్‌, రహానె, ఇర్ఫాన్‌ పఠాన్‌లు కూడా తమ శుభ సందేశాలను ట్వీట్‌ చేశారు.

VVS-Laxman-edengaredns

వరుస టెస్టు విజయాలతో ఊపుమీదున్న ఆసీస్‌కు గర్వభంగం చేసి.. వారితోనే వెరీ వెరీ స్పెషల్ అని పిలిపించుకున్న వీవీఎస్ భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. లక్ష్మణ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఈడెన్ గార్డెన్స్‌లో ఆసీస్‌పై చేసిన 281 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్. జట్టు ఫాలోఆన్ ఆడుతున్నప్పుడు ద్రవిడ్‌తో కలిసి అద్భుతంగా పోరాడాడు. అసాధారణమైన ఆటతీరుతో 281 పరుగులు చేసి.. టెస్టుల్లో వరుసగా 17 విజయాలు సాధించి, 18 విజయం ఖాయమనుకున్న కంగారూల జోరుకు బ్రేకులేశాడు. మెక్‌గ్రాత్, గిలెస్పీ, షేన్‌వార్న్ లాంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

laxman

2001లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తను ఈ అత్యద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న తీరు ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. గత 16 ఏళ్లలో లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్సే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా ఆలౌట్ క్రికెట్ మ్యాగజైన్ నిర్వహించిన ఓటింగ్‌లో వెల్లడైంది.

vvs-laxman-test

- Advertisement -