గాలి కోసం వేట..లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ

237
gali Janardhana Reddy
- Advertisement -

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్ధనరెడ్డి మరో చిక్కుల్లో పడ్డారు. రూ.18కోట్ల ముడుపుల కేసులో సిటీ క్రైం బ్రాంచ్(సీసీబీ) పోలీసులు గాలి జనార్ధన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఒక కేసులో “అంబిడెంట్” కంపెనీని ఈడీ నుంచి తప్పించేందుకు జనార్ధన్‌రెడ్డి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగాను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టురేట్ కు చెందిన అధికారులకు కోటి రూపాయలు లంచం ఇచ్చినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

సయ్యద్ అహ్మద్ ఫరీద్‌ అనే వ్యక్తి 2016-17లో ఆంబిడెంట్ గ్రూప్‌ అనే కంపెనీని ఏర్పాటు చేశాడు. నెలకు 30 నుంచి 40 శాతం లాభాలు ఇస్తామని పెట్టుబడిదారులకు హామీ ఇచ్చి… వారివద్ద నుంచి సుమారు రూ.600 కోట్ల మేరకు వసూలు చేశాడు. కొన్ని నెలల తర్వాత పెట్టుబడి దారులకు లాభాలు ఇవ్వలేక చేతులెత్తేశారు. 2017 జనవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) కంపెనీలో సోదాలు చేసి విలువైన పత్రాలును స్వాధీనం చేసుకుంది.

ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు గాలి జనార్దన్‌ రెడ్డితో రూ. 18 కోట్ల డీల్ కుదుర్చుకున్నారు ఫరీద్. మొదటగా రూ.18 కోట్లను రమేష్ కొఠారీ అనే బంగారం వర్తకుడికి ఇవ్వగా, రమేష్ ఆసొమ్ముతో 57 కేజీల బంగారాన్నికొని జనార్దన్ రెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న అలీఖాన్‌ సూచనల మేరకు బళ్లారికి చెందిన రాజ్‌మహల్‌ జ్యూయలర్స్ యజమాని రమేష్ కి పంపించినట్లు పోలీసులు తెలిపారు.

కేసు విచారణ గమనించిన గాలి జనార్ధనరెడ్డి పరారయ్యారు. సెర్చ్ వారెంట్‌తో బెంగళూరు, బళ్లారిలోని జనార్దన్‌రెడ్డి నివాసాల్లో మూడు సీసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.

- Advertisement -