ముగిసిన ఎస్‌బీహెచ్‌ శకం….

204
SBH slips into history
- Advertisement -

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) శకం ముగిసింది. ఏప్రిల్ 5, 1942న నిజాం సంస్థానంలో ప్రారంభమైన సామాన్య,మధ్యతరగతి ప్రజల ఆశల సౌధం ఎస్‌బీహెచ్‌ మాతృసంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)లో విలీనం కానుంది. లక్షలాదిమంది ఖాతాదారులతో శాఖోపశాఖలుగా విస్తరించిన ఎస్‌బీహెచ్ నేటితో కొత్త రూపు సంతరించుకోనుంది.

ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం నేటి నుంచి ప్రారంభమైన పూర్తిగా వ్యవస్ధలన్నింటినీ ఏకీకృతం చేయడానికి రెండు నెలల సమయం పట్టనుంది. ఈ విలీనంతో ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్‌భీఐ అనుబంధ బ్యాంకులతో పోలిస్తే కార్పొరేట్లకు తక్కువ రేట్లపై రుణాలు లభ్యం అవుతాయి. అనుబంధ బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐకి అంతర్జాతీయంగా నిధులను తక్కువ రేటుకే సమీకరించుకునే సత్తా ఉండడం ఇందుకు ఉపకరిస్తుంది. సిబ్బంది సంఖ్య పెరగనుండడంతో మరిన్ని సేవలను కౌంటర్ల ద్వారా అందించడానికి వీలుంటుందని పై స్థాయి అధికారులు చెబుతున్నారు.

SBH slips into history

నేటికి సరిగ్గా ఏడున్నర దశాబ్దాల క్రితం 1941లో హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీలో హైదరాబాద్ స్టేట్ బ్యాంకు చట్టం కింద దీనిని  నిర్మించారు. ఇండో-యూరోపియన్ నిర్మాణ శైలిలో అత్యద్భుతంగా నిర్మించారు… దీనికి వారసత్వ భవనంగానూ గుర్తింపు లభించింది. అప్పట్లో రిజర్వు బ్యాంకు బ్రిటిష్ ప్రభుత్వ అధీనంలో ఉండేది. నిజాం ప్రభుత్వంలో సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థ లేకపోవడంతో ఈ బ్యాంకును ఏర్పాటు చేశారు.

అప్పటి కరెన్సీ ‘ఉస్మానియా సిక్కా’లో బ్యాంకు కార్యకలాపాలు కొనసాగాయి. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యాక ఈ బ్యాంకుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌’ (ఎస్‌బీహెచ్)గా నామకరణం చేశారు. 1950  నాటికి 50 శాఖలు కలిగిన ఎస్‌బీహెచ్‌కు నేడు 2 వేల బ్రాంచ్‌లు ఉన్నాయి. గన్‌ఫౌండ్రి శాఖలో 20 వేల మంది ఖాతాదారులున్నారు. ఆసియాలోనే అతిపెద్ద లాకర్స్ వ్యవస్థ ఇందులో ఉండడం విశేషం. నేడు ఎస్‌బీహెచ్‌ విలీనం కానుండడంతో శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది బ్యాంకు ముందు నిల్చుని సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు దిగడం కనిపించింది.

కొత్త వాతావరణంలో కొంత మంది ఇమడలేకపోతారన్న ఆలోచనతోనే వీఆర్‌ఎస్‌ను ఎస్‌బీఐ తీసుకొచ్చిందని తెలుస్తోంది. అనుబంధ బ్యాంకుల్లో మొత్తం 70,000 మంది సిబ్బంది ఉండగా.. అందులో 12,000 మందికి వీఆర్‌ఎస్‌ అర్హత ఉంది. ఈ నెల 5 తర్వాత కానీ ఎంత మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారన్న విషయంపై స్పష్టత రాదు. అంతక్రితం ఆర్‌బీఐని కోరినట్లుగానే విలీన ప్రక్రియను మూడు నెలల్లోపు పూర్తి చేయడానికే మొగ్గుచూపుతున్నట్లు ఎస్‌బీఐ ఎండీ రజనీశ్‌ కుమార్‌ చెబుతున్నారు.

మొత్తం మీద 1500-1600 వరకూ ఎస్‌బీఐ, అనుబంధ బ్యాంకుల శాఖలను మూసివేసే అవకాశాలున్నాయని రజనీశ్‌ కుమార్‌ అంచనా వేశారు. ఇప్పటికే అనుబంధ బ్యాంకుల నుంచి రుణాల జారీ నిలిపివేశారు. ఈ నెల 15 నుంచి రుణాల జారీలో స్పష్టత రావొచ్చు.

చెక్కుల క్లియరెన్స్‌, నగదు డిపాజిట్‌ మెషీన్‌, తదితర సదుపాయాల కోసం ప్రస్తుత శాఖనే ఉపయోగించుకోవాలి. అన్ని ఫారెక్స్‌ వ్యాపారం/లావాదేవీలను ప్రస్తుత శాఖల ద్వారానే లావాదేవీలు జరుపుకోవచ్చు. ఎస్‌బీఐకి, ఇతర అనుబంధ బ్యాంకు శాఖల మధ్య నగదు బదిలీ ఉచితంగానే చేసుకోవచ్చు.అనుబంధ బ్యాంకుల ఖాతాదారులు నేటి నుంచి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలకు ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవల ద్వారా చేసుకోవచ్చు. పాత యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తోనే ఇదీ పనిచేస్తుంది. ఎస్‌బీ ఎనీవేర్‌ అసోసియేట్‌ బ్యాంక్స్‌ యాప్‌ను మాత్రం తదుపరి నోటీసు వరకూ వినియోగించుకోవచ్చు.

ఖాతాదార్లకు ఏవైనా సందేహాలుంటే.. 1800 180 6005, 1800 425 1825, 1800 425 2244, 1800180 2010, 1800 425 5566 టోల్‌ ఫ్రీ నంబర్లలో సంప్రదించవచ్చు.

- Advertisement -