తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పార్టీలో చక్రం తిప్పాలని భావించిన శశికళకు మొదటినుంచీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శశికళను పార్టీ నుంచి తొలగించారు.
అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్న దినకరన్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే అక్రమాస్తుల కేసులో ‘చిన్నమ్మ’ శశికళ జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ జైలుకు వెళ్లిన అనంతరం అనేక మలుపులు తిరిగిన అన్నాడీఎంకే రాజకీయాలు మొత్తానికి ఒకతాటిపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటై శశికళ వర్గాన్ని బయటికి నెట్టారు. తాజాగా జరిగిన సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని తీర్మానించారు. ఆ బాధ్యతలను తాత్కాలికంగా చేపట్టిన శశికళను పదవి నుంచి తొలగిస్తూ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా అమ్మ, దివంగత జయలలిత స్వయంగా పదవుల్లో నియమించిన వారిని ప్రస్తుతానికి కొనసాగించాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది. రెండాకుల గుర్తు తమకే చెందుతుందని మరో తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది.
కాగా..పార్టీ చీఫ్ కో ఆర్డినేటర్‌గా పన్నీర్ సెల్వం, అసిస్టెంట్ చీఫ్ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి ఉంటారని కార్యవర్గం పేర్కొంది. ప్రధాన కార్యదర్శికి ఉండే అధికారాలన్నీ చీఫ్ కో ఆర్డినేటర్, అసిస్టెంట్ చీఫ్ కో ఆర్డినేటర్లకు ఉంటాయని సమావేశంలో తీర్మానించారు.