సెన్సార్ పరమైన ఇబ్బందులు ఎదుర్కొనడం ద్వారా ఇటీవలకాలంలో అత్యంత చర్చనీయాంశమైన చిత్రం “శరణం గచ్ఛామి”. రిజర్వేషన్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని అడ్డంకులు అధిగమించి ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమరాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మిస్తున్న ఈ చిత్రం ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..
కథ :
మానవ్ (నవీన్ సంజయ్) జర్నలిజం చదువుతూ సమాజంలో జరిగే అన్యాయాల్ని ఎదురిస్తుంటాడు. ముఖ్యంగా తన పీజీ రీసెర్చ్ కోసం కులం, రిజర్వేషన్ అనే టాపిక్స్‌ని ఎంచుకుని పరిశోధన మొదలుపెడతాడు. ఈ క్రమంలో మానవ్‌కు ఎదురైన ఇబ్బందులేంటీ..?తన పరిశోధనలో తెలుసుకున్న నిజాలేంటీ..?తనకు ఎదురైన సమస్యలను ఎలా అధిగమించాడు అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
భారతదేశ రాజ్యాంగంలో అత్యంత కీలకమైన అంశం, దేశ రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసే అంశం అయిన రిజర్వేషన్ ను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిజర్వేషన్ సిస్టం, అందులోని లోటుపాట్లు ఎత్తిచూపించడం ఈ సినిమాలో మెప్పించే అంశాలు. కులవ్యవస్థ మనుషుల మధ్య ఎలాంటి అవాంతరాలను సృష్టించిందనేది అద్బుతంగా చూపించారు. రిజర్వేషన్లను కొంతమంది స్వార్ధపరులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు..అంబేద్కర్ తయారు చేసిన రాజ్యంగం పట్ల ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది అనేదానిని చక్కగా చూపించారు. మత పరమైన రిజర్వేషన్లకు అంబేద్కర్ రాసిన రాజ్యంగం మాత్రమే సమాధానమని చెప్పేందుకు చేసిన ప్రయత్నం బాగుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథనం, ఫస్టాఫ్ మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ కోసం వాడుకోవడం. ఇక హీరో ఫ్రెండ్స్ బ్యాచ్, హీరో ఫ్యామిలీ మీద నడిచే సన్నివేశాలైతే చికాకు తెప్పించాయి. రిజర్వేషన్ సిస్టమ్ అనే బలమైన, సమస్యాత్మక అంశాన్ని ప్రభావితంగా చెప్పాలనుకున్నప్పుడు నటీ నటుల పెర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం. కానీ ఈ సినిమాలో అదే లోపించింది. అలాగే ఆ సినిమాలోని కొన్ని వర్గాలను ఎత్తిచూపడం సరైనదే అయినా కూడా అది కొందరికి నచ్చదు.
సాంకేతిక విభాగం :
దేశ రాజకీయాల్లో కీలకమైన రిజర్వేషన్ల అంశాన్ని ఎంచుకున్న రచయిత మురళి బొమ్మకుని అభినందించాల్సిందే. అయితే మంచి అంశాన్నే ఎంచుకున్నాడు గానీ దాని చుట్టూ ఒక పూర్తి స్థాయి సినిమాకు కావాల్సిన కథానాన్ని అల్లుకోవడంలో చాలా వరకు విఫలమయ్యాడు. రవి కళ్యాణ్ అందించిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఫస్టాఫ్ లో అనవసరమైన సన్నివేశాలని ఇంకా తొలగించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
అసలు రోజర్వేషన్ ఎందుకు, ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉంది, ఎలా దుర్వినియోగం అవుతుందో చూపించే ప్రయత్నమే శరణం గచ్ఛామి. రిజర్వేషన్ సిస్టం, అందులోని లోటుపాట్లు ఎత్తిచూపడం సినిమాకు ప్లస్ కాగా ఏమాత్రం ఆకట్టుకోని హీరో లవ్ ట్రాక్, నటీనటుల నటన, కొన్ని సన్నివేశాలు సినిమాకు మైనస్ పాయింట్స్. మొత్తంగా సామాజిక అంశాల మీద రియాక్టయ్యే వారికి నచ్చే శరణం గచ్ఛామి.
విడుదల తేదీ : 7/04/2017
రేటింగ్ : 2.25/5
నటీనటులు : నవీన్ సంజయ్, తనిష్క్ తివారి
సంగీతం : రవి కళ్యాణ్
నిర్మాత : బొమ్మకు మురళి
దర్శకత్వం : ప్రేమ్ రాజ్