సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి బ్యానర్‌పై సప్తగిరి, రోషిణి ప్రకాష్ హీరో హీరోయిన్లుగా అరుణ్ పవార్ దర్శకత్వంలో డా.కె.రవికిరణ్ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్`. డిసెంబర్ 23న ఈ సినిమా విడుదలై 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా 50రోజుల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా…
తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ – “కొత్త సినిమాలు వస్తుండాలి..సక్సెస్ అవుతుంటేనే అప్పుడే ఇండస్ట్రీ బావుంటుంది. తెలంగాణలో చిత్ర పరిశ్రమకు ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఎంతో అండగా ఉన్నారు. చిన్న చిత్రాలకు ప్రభుత్వం తమ వంతు సహకారాన్ని అందిస్తుంది. మల్టీప్లెక్స్‌ల్లో ఐదో ఆటను వేయమని జి.వో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్ టికెట్స్ విధానానికి మద్ధతు ఇస్తున్నాం. అందుకోసం ప్రభుత్వమే సైట్స్‌ను పెట్టి టికెట్స్‌ను విక్రయించేలా ప్లాన్ చేస్తున్నాం. మంచి సందేశాత్మక చిత్రాలతో పాటు చారిత్రాత్మక చిత్రాలైన గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి వంటి చిత్రాలకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చాం. ప్రతి ఏడాది ఉగాది పండుగకు ఇచ్చే నంది అవార్డులను ఈసారి దసరా పండుగకు ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ వంటి విజయవంతమైన చిత్రాన్ని చేసిన దర్శక నిర్మాతలకు అభినందనలు“ అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ – “చిన్న సినిమాగా అనుకుని స్టార్ట్ చేస్తే చాలా పెద్ద సినిమా అయ్యింది. మాస్ ఆడియెన్స్ సినిమాను పెద్ద హిట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు వచ్చి ఎంకరేజ్ చేయడంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. రవికిరణ్ బిజినెస్ ఉద్దేశంతో కాకుండా ప్రతి సీన్ హైలెట్‌గా ఉండాలని సినిమా చేశారు. సినిమాపై ఎన్ని రూమర్స్ వచ్చినా, చాలా పెద్ద హిట్ అయ్యింది. రవికిరణ్ వంటి మంచి మిత్రుడు నిర్మాతగా మారడంతో సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. మిత్రుడు షకలక శంకర్ ఎంతో సహకారం అందించారు. ఇలాగే మరిన్ని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను“ అన్నారు.
రవికిరణ్ మాట్లాడుతూ – “చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టి మంచి క్వాలిటీతో సినిమా చేశాం. అయితే పవన్‌కళ్యాణ్ ఆడియో వేడుకకు రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలైన సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. దర్శకుడు అరుణ్, మ్యూజిక్ డైరెక్టర్ బుల్‌గానిన్, గౌతంరాజు సహా అందరూ నాకు సపోర్ట్ చేశారు. కె.ఎఫ్.సి. కమలాకర్‌కి థాంక్స్. మళ్ళీ నేను, సప్తగిరి కలిసి మా బ్యానర్‌లో మరో సినిమా చేయబోతున్నాం. రెండు స్క్రిప్ట్స్ సిద్ధమయ్యాయి. మంచి క్యారెక్టర్ బేస్‌డ్ కథ, సప్తగిరి ఎక్స్ ప్రెస్ కంటే క్వాలిటీతో సినిమా చేస్తాం. మంచి మెసేజ్ కూడా ఉంటుంది అని తెలిపారు. ఇక సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఘనవిజయం సాధించిన సందర్భంగా సాయి సెల్యులాయిడ్ బ్యానర్ తరుపు నుంచి చిత్ర హీరోకి కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు నిర్మాత డాక్టర్ రవికిరణ్.
ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ – “మోహన్‌బాబు తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత సప్తగిరి హీరోగా ఎదగడం చూస్తే ఆనందంగా ఉంది. ఒక కమెడియిన్ స్థాయి నుండి హీరో ఎదగడం చిన్న విషయం కాదు. నేను నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా సినిమాలు చేశాను. రోజాను సినీ ఇండస్ట్రీకి నేనే పరిచయం చేశాను. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్నాను. ఆ సమయంలో సప్తగిరి నన్ను కలిసి ఈ సినిమాలో క్యారెక్టర్ గురించి చెప్పాడు. నాకు తీరిక లేదని చెప్పినా వెయిట్ చేస్తానని చెప్పి వెయిట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఆశీస్సులు అందించారు. నిర్మాత రవికిరణ్‌కి మంచి గట్స్ ఉన్నాయి. రామానాయుడుగారిలో ఉన్న మంచి లక్షణాలన్నీ రవికిరణ్‌లో నేను గమనించాను. దర్శక నిర్మాతలు అందరినీ కలుపుకుని మంచి సినిమా తీసి పెద్ద సక్సెస్ సాధించారు. భవిష్యత్‌లో ఈ బ్యానర్‌లో మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ – “మా ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చిన రవికిరణ్ నిర్మాతగా రాణించడం ఆనందంగా ఉంది. ఇలాంటి విజయవంతమైన సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.