శివసేన (UBT) పార్టీలో చీలిక రాబోతుందనే ఊహాగానాల మధ్య ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్…. తిరుగుబాటు ఎంపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తిరుగుబాటు ఎంపీలపై తీవ్ర పదజాలం (బూతులు) ఉపయోగించిన రౌత్…అలాగే ప్రసారం చేయాలని కోరారు.
శివసేన (UBT) లోని తొమ్మిది మంది ఎంపీలలో ఏడుగురు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనతో టచ్‌లో ఉన్నారని వారు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని ఆపరేషన్ టైగర్ పేరిట ప్రచారం జరుగుతోంది. దీనిపై రౌత్ స్పందిస్తూ…ఎవరైనా వెళ్లాలనుకుంటే ముందు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలి….. మా ఎంపీల గురించి ఇలాంటి వార్తలు వస్తే, వారు వాటిని ఖండించాలి. ఈసారి మహారాష్ట్ర ప్రజలు ఈ నమ్మకద్రోహాన్ని చూస్తూ ఊరుకోరు అని హెచ్చరించారు.
ఉద్ధవ్ ఠాక్రే మరియు తాము రక్తం, చెమట చిందించి, డబ్బు ఖర్చు చేసి గెలిపించిన ఎంపీలు పార్టీకి ద్రోహం చేస్తే ఊరుకునేది లేదని రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీని చీల్చడానికి ఒక్కో ఎంపీకి రూ. 15 కోట్ల చొప్పున అడ్వాన్స్ అందజేసి….నాందేడ్, పుణే వంటి ప్రాంతాల నుండి చార్టర్డ్ ఫ్లైట్లలో తరలించారనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎంపీల కనీస మద్దతు ధర రూ. 50 కోట్లుగా నిర్ణయించబడిందని ఆయన ఎద్దేవా చేశారు.
సంజయ్ రౌత్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై అదే పార్టీకి చెందిన ఎంపీ అనిల్ దేశాయ్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రౌత్ మాట్లాడిన మాటలు భావోద్వేగంతో చేసినవి మాత్రమేనని…అవి ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించినవి కావని వివరణ ఇచ్చారు. 50 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉంటూ ఎమోషనల్‌గా ఉండే వ్యక్తి మాట్లాడేటప్పుడు ఇలాంటివి సహజమని అన్నారు. కాగా ఈ సంక్షోభం నేపథ్యంలో జూన్ 18న ఢిల్లీలో శివసేన (UBT) తమ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించనుంది మరియు ఎంపీలందరూ హాజరుకావాలని విప్ జారీ చేసింది.
Also Read:రికార్డులతో పనిలేదు:మెస్సీ

