సానియా మీర్జా టెన్నిస్ బాల్‌నే కాదు.. అప్పుడప్పుడు తనకెదురయ్యే ప్రశ్నల్ని సైతం తనదైన స్టైల్లో తిప్పికొడుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి దిమ్మతిరిగే సమాధానమిచ్చింది ఈ టెన్నిస్ స్టార్. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్ళిచేసుకోవడంపై ఎగతాళి చేసిన ఓ వ్యక్తికి సుతిమెత్తగా చురకలంటించింది.
కశ్మీర్‌లో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి ప్రాణాలు తీయడంపై ఇటీవల సానియా మీర్జా ట్విటర్లో స్పందిస్తూ… ‘‘ప్రపంచానికి మనం చూపించాలనుకుంటున్నది నిజంగా ఇలాంటి దేశాన్నేనా? కుల, మత, వర్ణ, ప్రాంతాలకు అతీతంగా మనం ఈ 8 ఏళ్ల బాలిక తరపున నిలబడకపోతే… ప్రపంచంలో ఇక దేనికీ అండగా నిలబడనట్టే. అది మానవత్వం అని కూడా అనిపించుకోదు.. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది…’’ అని పేర్కొంది.
అయితే సానియా ట్వీట్‌పై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. ‘‘ మేడం.. మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారు. మీరు పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక మీరు ఏమాత్రం ఇండియన్ కాదు. ఒక వేళ మీరు ట్వీట్ చేయాలనుకుంటే పాకిస్తాన్ ఉగ్రమూకలు చంపుతున్న అమాయకులపై కూడా ట్వీట్ చేయండి..’’ అని పేర్కొన్నాడు.
దాంతో..ఆ నెటిజన్ వ్యాఖ్యలపై సానియా కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించింది. ‘‘అన్నిటికంటే మొదటిది… ఓ వ్యక్తి ఏదేశం వారినైనా వివాహం చేసుకోవచ్చు. రెండోది.. నేను ఏ దేశస్తురాలినో నీలాంటి అథమ స్థాయి వ్యక్తులు చెప్పక్కర్లేదు. నేను భారత దేశం కోసమే ఆడతాను. నేను ఇప్పటికీ ఎప్పటికీ భారతీయురాలిగానే ఉంటాను. ఒకవేళ నువ్వు దేశం, మతాలకు అతీతంగా ఆలోచించగలిగితే… ఒకనాటికి మానవత్వం వైపు కూడా నిలబడతావు…’’ అంటూ జవాబిచ్చింది సానియా.