యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 తర్వాత నటిస్తున్న చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వం వహించిన ఈమూవీని యూవీ క్రియేషన్స్ సంస్ధ భారీ బడ్జెట్ తో నిర్మించింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈచిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు చిత్రయూనిట్.
త్వరలోనే ఈచిత్రం ఆడియో ఫంక్షన్ ను నిర్వహించే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. ఈసినిమా తెలుగుతో పాటు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి స్టేట్ లో ఆడియో ఫంక్షన్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ను కూడా తయారు చేశారు. ఆగస్ట్ 17న హైదరాబాద్‌లో, 21న కొచ్చిన్‌లో, 25న బెంగళూర్‌లో, 27న ముంబైలో ఆడియో ఫంక్షన్ జరపనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.
నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇటివలే విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం ఆడియో ఫంక్షన్లు కూడా పలు భాషల్లో నిర్వహించారు. ఇప్పుడు అదే బాటలో సాహో టీం కూడా ఆడియో ఫంక్షన్లు జరపనుంది.