సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సారథ్యంలో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించింది బీజేపీ. పార్టీ అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచి కేబినెట్ విస్తరణ వరకు తన మార్క్ స్పష్టంగా చూపించిన మోడీ…అద్వానీ,జోషీలకు టికెట్లు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీలో కొంత వ్యతిరేకతవచ్చినా వెనక్కి తగ్గని మోడీ తనపని తాను చేసుకుంటూ వెళ్లారు.
అయితే త్వరలో ఖాళీ కాబోయే రాజ్యసభ స్ధానాల్లో సీనియర్ నేతలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారని సమాచారం. వయసు కారణంగా అద్వానీ, జోషీలను పార్టీ పోటీకి నిరాకరించగా.. అనారోగ్యం కారణంగా మాజీ కేంద్రమంత్రి సుష్మా పోటీకి దూరంగా ఉన్నారు. వీరిని పెద్దల సభకు పంపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండు నెలల్లో రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ కానున్నాయి. గుజరాత్‌లో 2, బిహార్ 1, అస్సాం 2, తమిళనాడులో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నిక అనివార్యం కానుంది. వీటిలో మెజార్టీ స్థానాలను అధికార బీజేపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. సీనియర్ల సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో వీరిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
వీరితో పాటు విదేశాంగ మంత్రిగా నియమితులైన ఎస్ జైశంకర్, రాంవిలాస్ పాశ్వన్‌లను కూడా రాజ్యసభకు పంపనున్నారు. త్వరలో జరిగే బీజేపీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది.