కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. గత కొంత కాలంగా ఆ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు రాహుల్ గాంధీ సభ సాక్షిగా భగ్గుమంది. ఏకంగా రాహుల్ గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ బాహాబాహీకి దిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ సభలకు తెలంగాణకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేతలకు అనుమతి లేకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గొడవకు దిగుతున్నారు. తాజాగా హరితాప్లాజలో రాహుల్ గాంధీ ఓయూ విద్యార్ధులతో నిర్వహించిన సమావేశంలో గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆ పార్టీ నేతలు ఆగమాగం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జానారెడ్డి పేరు లేకపోవడంతో సమావేశంలో ఆయన వర్గం నేతలు ఆందోళనకు దిగారు. దీంతో జానారెడ్డితో పాటు షబ్బీర్ అలీ కూడా అలిగి బయటికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. వీరిద్దరిని సభలోంచి బయటికి వెళ్లనీవకుండా గూడూరు నారాయణరెడ్డి వారిద్దరిని బతిమిలాడి తిరిగి సభలోపలికి పంపించారు. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత రేవంత్ రెడ్డికి ఏకంగా సభలోకి అనుమతిలేకుండా పోయింది. రాహుల్ గాంధీ సభలోకి రేవంత్ రెడ్డిని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
అటు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో జరిగిన సమావేశంలోనూ గొడవ జరిగింది. సభలోకి కొంత మంది విద్యార్థులను మాత్రమే అనుమతించడంతో అనుమతి లభించని విద్యార్థులు గొడవకు దిగారు. తమను కూడా లోపలికి పంపించాలంటూ నినాదాలు చేశారు. దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు రాహుల్ సమక్షంలోనే ఒకరిపై ఒకరు దాడికి పాల్పడుతూ తన్నుకున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనతో ఆ పార్టీకి ఏమన్నా ఒరుగుతుందేమో అని ఆశించిన టీపీసీసీ లీడర్లకు రాహుల్ సభల్లో జరుగుతున్న పరిణామాలతో ఏం చేయాలో తోచడం లేదు.