‘సూటు బూటు సర్కారు’ అంటూ గతంలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన రాహుల్‌పై ఇప్పుడు బీజేపీ దాడి మొదలుపెట్టింది. మేఘాలయ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎదురుదాడికి దిగింది.
మంగళవారం షిల్లాంగ్‌లో జరిగిన సంగీత కార్యక్రమానికి ఖరీదైన జాకెట్ ధరించి రాహుల్ హాజరయ్యారు. దీన్ని తమకు అవకాశంగా మలుచుకుని బీజేపీ మేఘాలయ విభాగం ట్విటర్‌లో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది.
దాదాపు రూ.70 వేల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ జాకెట్ ధరించారని ట్విటర్‌లో ఫొటోలు పోస్ట్ చేసింది. మేఘాలయ ప్రజల గురించి పట్టించుకోకుండా, రాష్ట్రంలో ఉన్న అసమర్థ సర్కారుకు వంతపాడతారా అని ప్రశ్నించింది. రాహుల్ చూపిస్తున్న పక్షపాతం మేఘాలయ ప్రజలను వెక్కిరిస్తున్నట్టుగా ఉందని బీజేపీ విమర్శించింది.
అయితే ఇదిలా ఉండగా..రాహుల్ గాంధీ ఏకంగా రూ. 70వేలు ఖరీదు చేసే జాకెట్‌ను తొడుక్కున్నారని బీజేపీ చేస్తున్న విమర్శలను తాజాగా కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. రాహుల్ జాకెట్ విషయంలో బీజేపీ చేస్తున్న విమర్శలను తేలికగా కొట్టిపారేసింది. బీజేపీ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరీ స్పందించారు.
బీజేపీ ఆరోపణలపై మీడియా ప్రశ్నించగానే.. రేణుక అమాంతం నవ్వేశారు. బీజేపీ నిస్పృహకు ఈ ఆరోపణలు అద్దం పడుతున్నాయని ఆమె అన్నారు. కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో వెతికి.. ఇలా రేట్లు ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఆ జాకెట్ రూ. 70 వేలు.. రూ. 700లకు సైతం దొరుకుతుంది.. కావాలంటే ప్రధాని మోదీకి కొనిస్తామని రేణుకా చౌదరీ అన్నారు.