దేశవ్యాప్తంగా 65శాతం మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నందున.. డిజిటల్ లావాదేవీలపై సేవా రుసుము ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. డెబిట్ కార్డుల వినియోగంపై రుసుములు పూర్తి ఎత్తివేస్తున్నట్లు దాస్ ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజల కష్టాలను తీర్చడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తాము తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. పెద్దనోట్ల రద్దు కారణంగా నగదు కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుకింగ్‌కు డిసెంబర్ 31 వరకు సేవా రుసుము రద్దు చేసిందని.. ట్రాయ్ యూఎస్‌ఎస్‌డీ ఛార్జీలను రూ.1.50 నుంచి 50పైసలకు తగ్గించిందని తెలిపారు. ఈ-వ్యాలెట్లలో నగదు పరిమితిని ఆర్‌బీఐ రూ.20వేలకు పెంచినట్లు చెప్పారు.
కొత్త రూ.2000 నోట్లు సహా అన్ని నోట్లను విత్ డ్రా చేసుకునేందుకు ఇప్పటివరకు మొత్తం 82,000 ఏటీఎం కేంద్రాలను రీ కాలిబరేట్ చేసినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే దేశంలో ఏటీఎంల సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు. పూర్తి స్థాయిలో ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరత లేకుండా 1.5లక్షల తపాలా కార్యాలయాలు నగదు సరఫరా చేస్తున్నట్లు శక్తికాంత దాస్ ప్రకటించారు. సహకార బ్యాంకులకు నాబార్డు రూ.21వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. నాబార్డ్, ఆర్‌బీఐ అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరుణ్‌జైట్లీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు పలు సూచనలు చేశారని ఆయన తెలిపారు..
నోట్ల మార్పిడి, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణకు వెసులుబాటు కల్పించినా, అవసరానికి సరిపడా అందడం లేదు. దీంతో కాస్త బాగా ఖర్చు పెట్టేవారు కూడా పొదుపు బాట పట్టారు. ఇదే సమయంలో ‘ఎలక్ట్రానిక్ చెల్లింపులు’ కొనుగోళ్లకు ప్రత్యామ్నాయ మార్గం అయ్యాయి. సరుకులు, కూరగాయలకూ డెబిట్/ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మొబైల్ వ్యాలెట్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వచ్చిన వెంటనే పేటీఎం కార్యరంగంలోకి దూకింది. దుకాణాలతో ఒప్పందం చేసుకుని, తమ వ్యాలెట్‌లో నగదు ఉంచుకుంటే, దుకాణాల్లో బిల్లులు చెల్లించవచ్చంటూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ విధానం సులువుగా ఉండటంతో, ఖాతాదారులూ మొగ్గుచూపుతున్నారు. మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఓలా మనీ ఇలా అన్నింటిదీ ఇదే దారి.