ఛలో సినిమాతో తెలుగులో అడుపెట్టిన కన్నడ బ్యూటీ రష్మికమందన్న ఆతర్వాత ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన గటించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి ‘డియర్ కామ్రెడ్’ సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక ప్రస్తుతం మహేష్ బాబు, అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’లో చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ పాత్రలపై సంచలన కామెంట్స్ చేసింది.
అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటున్న ఈ కన్నడ సొగసరి అభినయానికి ఆస్కారమున్న పాత్రల్ని ఎంచుకుంటూ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. రష్మిక మాట్లాడుతూ.. బోల్డ్ కథాంశాలతో చాలా మంది దర్శకనిర్మాతలు తనను సంప్రదించారని కానీ అలాంటి పాత్రలు చేయకూడదనే ఆలోచనతో వాటిని తిరస్కరించానని తెలిపింది.బాహ్య రూపం కంటే అంతఃసౌందర్యానికే తాను విలువనిస్తానని చెబుతున్నది రష్మిక. ఆత్మసౌందర్యమే మన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని అంటోంది.
గ్లామర్ పాత్రలు చేయడానికి చాలా మంది కథానాయికలు ఉన్నారు.వారి బాటలో నేను అడుగులు వేయడంలో ఉపయోగమేమివుండదు. హీరోయిన్ అనగానే గ్లామర్ పాత్రలు మాత్రమే చేయాలని అనుకోవడం అర్థం లేదు. నేను గ్లామరస్ హీరోయిన్ను కాదు. అలాంటి పాత్రల్లో నన్ను ప్రేక్షకులు స్వీకరించలేరని అనుకుంటున్నాను. అందాల ప్రదర్శనతో సంబంధం లేకుండా నా శైలికి సరిపోయే సినిమాల్నే అంగీకరిస్తాను అని తెలిపింది.