ఐదు దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరించిన నటుడు రాళ్లపల్లి నర్సింహరావు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రాళ్లపల్లి మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న నటులు రాళ్లపల్లి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.
2 వేలకు పైగా నాటకాల్లో నటించిన ఆయన 800పైగా చిత్రాల్లో నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని చెప్పారు. స్త్రీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాళ్లపల్లి లక్షల మంది హృదయాలను కొల్లగొట్టారు.
ఊరిబతుకులు చిత్రంలో హరిశ్ఛంద్రుడిగా తాగుబోతు పాత్ర వేశానని దానికి నంది అవార్డు వచ్చిం దన్నారు. బాపుగారి ‘తూర్పువెళ్లే రైలు’ నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అన్నారు.ఇండస్ట్రీలోకి ఎంట్రీ బాపుగారు పెట్టిన భిక్షే అన్నారు. తూర్పు వెళ్లే రైలు సినిమా షూటింగ్‌కి లేట్‌గా వెళ్లా. అప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా లీవ్ దొరకడానికి లేట్ అయ్యింది. క్షమించాలి సార్.. లీవ్ ఆలస్యం కావడంతో షూటింగ్‌కి రాలేకపోయా అన్నా.. బాపు గారు పర్లేదయ్యా అన్నారు. ఈ సినిమా విడుదలయ్యాక నువ్ ఉద్యోగం చేయాల్సిన అవసరం రాదులే అన్నారు.
ఆయన అన్నట్లుగానే ఆ సినిమా పెద్ద హిట్ అయిందన్నారు. తూర్పు వెళ్లే రైలు సినిమా తర్వాత సినీ కెరీర్‌లో ఎప్పుడూ తిరిగచూసే అవకాశం రాలేదన్నారు. తర్వాత అభిలాష, అన్వేషణ, పట్నంపిల్ల సినిమాలతో మంచి పేరు వచ్చిందన్నారు.