రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తూ, రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో విలీనం కావడానికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి రాజ్యసభ సెక్రటేరియట్ అధికారిక నోటీసును కూడా జారీ చేసింది.
ఈ పరిణామంతో రాజ్యసభ రికార్డుల్లో ఆ ఏడుగురు ఎంపీలు ఇప్పుడు బిజెపి సభ్యులుగా నమోదయ్యారు. దీని ఫలితంగా రాజ్యసభలో బిజెపి బలం 113కు పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు — రాఘవ్ చద్దా, అశోక్ కుమార్ మిట్టల్, హర్భజన్ సింగ్, సందీప్ కుమార్ పాఠక్, విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని, స్వాతి మలివాల్ మరియు రాజిందర్ గుప్తా — ఏప్రిల్ 24న పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో బిజెపి చీఫ్ నితిన్ నబిన్ మరియు సీనియర్ నేత తరుణ్ చుగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవ్ చద్దా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ కార్యకలాపాలకు నేను ఎందుకు దూరంగా ఉన్నానో అసలు కారణం చెబుతున్నాను. వారి (ఆప్) నేరాల్లో నేను భాగస్వామిని కావాలని అనుకోలేదు. ఆ నేరాల్లో నేను లేను కాబట్టే వారి స్నేహానికి నేను అనర్హుడినయ్యాను. మా ముందు రెండు దారులు ఉన్నాయి – ఒకటి రాజకీయాల నుంచి తప్పుకుని గత 15-16 ఏళ్లుగా మేము చేసిన ప్రజా సేవను వదిలేయడం, లేదా మా శక్తి సామర్థ్యాలతో సానుకూల రాజకీయం చేయడం. అందుకే, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. రాజ్యసభలో ఆప్‌కు ఉన్న సభ్యుల్లో 2/3 వంతు మందిమి బిజెపిలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాం అన్నారు.
Also Read:సామాన్యురాలిలా కూరగాయలు కొన్న దీదీ!
భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం.. ఎన్నికైన ఎంపీలు పార్టీలు మారకుండా నిరోధించడం ఈ చట్టం ఉద్దేశ్యం. అయితే, ఈ చట్టంలో ఒక మినహాయింపు ఉంది: ఒక పార్టీకి చెందిన మొత్తం సభ్యులలో కనీసం రెండొంతుల (2/3rd) మంది సభ్యులు మరొక పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటే, దానిని ఫిరాయింపుగా పరిగణించరు. అది చట్టబద్ధమైన విలీనంగా గుర్తించబడుతుంది. అటువంటి సందర్భాల్లో ఆ సభ్యులపై అనర్హత వేటు పడదు. ఇప్పుడు ఆప్ ఎంపీల విషయంలో ఇదే జరిగింది.

