పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకున్న వేళ, రాజకీయ నాయకుల వ్యూహాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఓటర్లకు చేరువయ్యేందుకు అగ్రనేతలు అనుసరిస్తున్న తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక సామాన్యురాలిలా కూరగాయల మార్కెట్‌లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న మమతా బెనర్జీ, హఠాత్తుగా ఒక లోకల్ కూరగాయల మార్కెట్‌లోకి వెళ్లారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఒక సాధారణ గృహిణి తరహాలో అక్కడ కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు.దీదీ స్వయంగా బుట్ట పట్టుకుని కూరగాయలు ఏరుతున్న వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది.
మార్కెట్‌లోని వ్యాపారులతో, అక్కడికి వచ్చిన మహిళలతో ఆమె కాసేపు ముచ్చటించారు. నిత్యావసరాల ధరలు, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడూ కాటన్ చీర, హవాయి చెప్పులతో కనిపించే మమతా బెనర్జీ, ఇలా సామాన్యుల మధ్యకు రావడం తన “మా-మాటి-మానుష్” (తల్లి-నేల-ప్రజలు) సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తోందని ఆమె మద్దతుదారులు పేర్కొంటున్నారు.
మమతా బెనర్జీ చేసిన ఈ పనిని నెటిజన్లు కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రధాని మోదీ ఘటనతో పోల్చుతున్నారు.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక చిన్న కిరాణా షాపు వద్ద ఆగి పల్లీలు (వేరుశనగలు) కొనుగోలు చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Also Read:వాలా Ⅱ..హౌస్‌ఫుల్ రన్!
అగ్రనేతలు ఇలా నేరుగా ప్రజల మధ్యకు వచ్చి వస్తువులు కొనుగోలు చేయడం వెనుక బలమైన రాజకీయ సందేశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాము ప్రజల మనిషిమని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తమకు తెలుసని నిరూపించుకోవడానికి ఇదొక మార్గమని చెబుతున్నారు.బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన తరుణంలో, మమతా బెనర్జీ ఇలా మార్కెట్లకు వెళ్లడం ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఒకవైపు అభివృద్ధి మంత్రం, మరోవైపు సామాన్యులకు చేరువయ్యే ప్రయత్నాలతో దీదీ తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి, ‘దీదీ’ మార్కెట్ పర్యటన బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.

