కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని (Code of Conduct) ఉల్లంఘించినందుకు గాను అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించడమే కాకుండా, ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించారు.
ఇన్నింగ్స్ 5వ ఓవర్లో రఘువంశీ ఒక వివాదాస్పద రీతిలో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ (ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించడం) ద్వారా అవుట్ అయ్యాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన బంతిని రఘువంశీ మిడ్-ఆన్ వైపు నెట్టి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే నాన్-స్ట్రైకర్ వద్ద ఉన్న కామెరాన్ గ్రీన్ వద్దని చెప్పడంతో రఘువంశీ వెనక్కి తిరిగాడు.అదే సమయంలో మిడ్-ఆన్ నుండి మహమ్మద్ షమీ విసిరిన త్రో నేరుగా వచ్చి రఘువంశీకి తగిలింది.
ఆన్-ఫీల్డ్ అంపైర్లు దీనిని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ రోహన్ పండిట్, రఘువంశీ ఉద్దేశపూర్వకంగా తన దిశను మార్చి త్రోకు అడ్డుపడ్డాడని భావించి ‘అవుట్’గా ప్రకటించారు.ఈ నిర్ణయంతో షాక్ తిన్న రఘువంశీ మైదానంలోనే అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. తాను పరుగెత్తుకుంటూ వెనక్కి తిరిగే క్రమంలో దిశ మార్చడం సహజమేనని, అది కావాలని చేసింది కాదని సైగలతో వివరించాడు.
పెవిలియన్ వైపు వెళ్తుండగా కోపంతో తన బ్యాట్‌తో బౌండరీ కుషన్‌ను కొట్టాడు.డగౌట్ వైపు తన హెల్మెట్‌ను విసిరేశాడు.మరోవైపు కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా ఫోర్త్ అంపైర్‌తో తీవ్రస్థాయిలో వాదించడం కనిపించింది.
ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం, క్రికెట్ పరికరాలను (బ్యాట్, హెల్మెట్) లేదా గ్రౌండ్ పరికరాలను (బౌండరీ కుషన్స్) దుర్వినియోగం చేయడం నేరం. రఘువంశీ చేసిన పని అగ్రెసివ్‌గా ఉందని భావించిన మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ ఈ జరిమానా విధించారు. రఘువంశీ తన తప్పును ఒప్పుకోవడంతో విచారణ లేకుండానే శిక్ష ఖరారు చేశారు.
Also Read:సామాన్యురాలిలా కూరగాయలు కొన్న దీదీ!
ఈ వివాదాస్పద అవుట్ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

