సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ పొలిటికల్ ఎంట్రీ వార్తలు తమిళనాట ఇప్పుడు హాట్ టాప్ గా మారాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు సంకేతాలు అందుతున్న నేపథ్యంలో… గత కొద్ది రోజులుగా రజనీ రాజకీయాల్లోకి రావాలని.. ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రజినీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్నట్టు చెప్తూ.. రజనీ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన సోదరుడు సత్యనారాయణరావ్ గైక్వాడ్ ఇటీవలే బెంగళూరులో వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు రజినీ ఏ పార్టీలోనూ చేరబోరని, సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తారని కూడా ఆయన తెలిపారు. పార్టీ పేరు, విధివిధానాలపై రజనీ కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇక ఇటీవలే అభిమానులతో భేటీ అయిన రజనీకాంత్.. జూన్, జులై నెలల్లో తమిళనాడులోని దాదాపు అన్ని నియోజకవర్గాలకు చెందిన అభిమానులు, ముఖ్యులతో రజనీ భేటీ అవుతారని చెప్పారు. జూలైలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు.
అయితే రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో రజినీ పై పలు విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావటం రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమని అన్నాడీఎంకే (అమ్మ) ప్రచార కార్యదర్శి నాంజిల్ సంపత్ పేర్కొన్నారు. అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ విరుదునగర్ జిల్లాలో సభ నిర్వహించారు.
సభలో పాల్గొన్న నాంజిల్ సంపత్ విలేకరులతో మాట్లాడుతూ రజనీ రాజకీయాల్లోకి రావటం తమిళనాడుకే తీవ్ర ప్రమాదమని, దీనిని తమిళనాడు యువకులు అడ్డుకోవాలని, కరుణానిధి నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.
పశు మాంసం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నట్లుగా తమిళనాడు ప్రభుత్వం కూడా మౌనాన్ని వీడి వ్యతిరేకించాలని, దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి హేళనగా మాట్లాడుతున్న ఇళంగోవన్ పెరియార్ మనుమడేనా అని సందేహంగా ఉందని పేర్కొన్నారు.
సభలో శాసనసభ్యులు పాల్గొనకపోవటం గురించి మాట్లాడుతూ ప్రజాదరణ తమకు ఉందని, శాసనసభ్యుని పదవి తాత్కాలికమైందన్నారు. కర్ణాటక రాష్ట్ర అన్నాడీఎంకే కార్యదర్శి పుగళేంది మాట్లాడుతూ ఇళంగోవన్ సంయమనం వీడి మాట్లాడుతున్నారని, ఇలాగే మాట్లాడితే తమిళనాడులో తలెత్తుకోలేరన్నారు.
ఓపీఎస్ వర్గం వృద్ధ జట్టని, అన్నాడీఎంకే ఇరువర్గాల విలీనం జరగదని, ముఖ్యమంత్రో లేక మంత్రులో దీని గురించి మాట్లాడటం ప్రజలను మోసం చేయటమేనన్నారు. అంతేకాకుండా.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అన్నాడీఎంకే దానిని ఎదుర్కొడానికి కూడా సిద్ధమేనని తెలిపారు.