రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ 161వ చిత్రం ‘కాలా’. ఈ సినిమాలో రజనీ లుక్‌ని ఇటీవల విడుదల చేశారు. ‘కబాలి’ విజయం తర్వాత మళ్లీ పా.రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కాలా’ అనే టైటిల్‌ను ఖరారుచేశారు. ఈ చిత్రాన్ని 2018లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని చిత్రీకరణ ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది.
ఈ సినిమా శీర్షిక గురించి దర్శకుడు మాట్లాడుతూ… ‘‘ ‘కాలా’ అంటే కాలుడు, యముడు అని అర్థం. ‘కరికాలన్’ అనే టైటిల్‌కు సంక్షిప్త రూపమే ‘కాలా’. చిత్రీకరణ తొలి షెడ్యూల్ ముంబయిలో, ఆ తర్వాత చెన్నైలో జరగనుంది. ఈ కథ అభిమానులకు బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది. చిత్రం టైటిల్ చెప్పగానే రజనీకాంత్‌కు బాగా నచ్చింది. చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు. అభిమానులను తృప్తి పరిచేలా ‘కాలా’లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయ’’ని వివరించారు.
ఈ సినిమా యూనిట్‌లో జాతీయ అవార్డు గ్రహీతలు నలుగురు ఉన్నారు. సినిమా నిర్మిస్తున్న ధనుష్ ‘ఆడుకళం’తో నటుడిగా, ‘కాక్కముట్టై’, ‘విసారణై’ చిత్రాలకు నిర్మాతగా జాతీయ అవార్డులు పొందారు. ‘రాక్’, ‘ది టెర్రరిస్ట్’, ‘కణ్ణత్తిల్ ముత్తమిట్టాళ్’ తదితర 7 చిత్రాలకు ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ పురస్కారాలను పొందిన శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికీ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘నా బంగారు తల్లి’కి జాతీయ అవార్డు పొందిన అంజలి పాటిల్, ‘విసారణై’కి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు కైవసం చేసుకున్న సముద్రగని ఇందులో నటించనున్నారని తెలిపారు.
మరోవైపు ‘కరికాలన్’ అనేది తమిళ భూమిని పరిపాలించిన చోళరాజుల్లో ఓ రాజు పేరని చరిత్ర చెబుతోంది. ఆయన జీవిత విశేషాల గురించి పూర్తి వివరాలు లభించనప్పటికీ కాంచీపురం నుంచి కావేరీ పరీవాహక ప్రాంతాల వరకు రాజ్యాన్ని విస్తరించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కరికాల చోళుడు రాళ్లతో నిర్మించిన ‘కల్లణై’ (రాతి ఆనకట్ట) జలాశయం నేటికీ చెక్కుచెదరకుండా అలనాటి నిర్మాణ కౌశలానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలవడం గమనార్హం.
కాలా మాస్ లుక్‌లో చుట్టూ మురికివాడ, భవనాలు, రైలు పట్టాలపై ఆడుకుంటున్న పిల్లలు, వీటి మధ్య జీపుపై స్టైల్‌గా మాస్‌లుక్‌తో కాలుమీద కాలేసుకుని కూర్చున్న రజనీ, ఆయన వెనుక నుంచి తొంగి చూస్తున్న ఓ కుక్క.. ఇలా ఈ పోస్టర్ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఇందులో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ రజనీకి జోడీగానటిస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం సమకూరుస్తున్నారు.