కేంద్రం తీసుకొచ్చిన నదీ జలాల గెజిట్ ఈ నెల నుండి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ గెజిట్ అమలును వాయిదా వేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కోరారు.
గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు బోర్డు పరిధిలోకి వెళ్తుందని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో దీనిపై చర్చిస్తామన్నారు.సీఎం కేసీఆర్ ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, గెజిట్ అమలుకు గడువు కావాలని కోరారన్నారు. ప్రస్తుతం గోదావరి బోర్డు పరిధిలోకి ఒక్క పెద్దవాగు మాత్రమే వస్తుందని చెప్పారు. సబ్‌కమిటీ నివేదికలపై చర్చిస్తామన్నారు.
పెద్దవాగు పరిధిలో రెండు వేల ఎకరాల ఆయకట్టు తెలంగాణకు, 13 వేల ఎకరాల ఆయకట్టు ఆంధ్రప్రదేశ్‌కు ఉందన్నారు. ఏపీ కోరుతున్నట్లు మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని చెప్పారు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు.