దేశంలో ఈ20 (E20) పెట్రోల్‌లో ఇథనాల్ శాతం నిబంధనలకు మించి ఉంటోందన్న ఆరోపణలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పెట్రోల్‌లో నిర్ణీత పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్న చమురు కంపెనీలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు.
కర్ణాటక ప్రభుత్వం ఏడు జిల్లాల నుంచి పెట్రోల్ నమూనాలను సేకరించి గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించిందని రాహుల్ గాంధీ తెలిపారు. మొత్తం 14 నమూనాల్లో 11 నమూనాల్లో ఇథనాల్ శాతం 20 శాతానికి మించి ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని పేర్కొన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) నమూనాల్లో 31.2 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) నమూనాల్లో 30.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు ఆరోపించారు. భారత్ పెట్రోలియం (BPCL), నయారా, షెల్ వంటి సంస్థల పెట్రోల్ నమూనాల్లోనూ పరిమితికి మించి ఇథనాల్ ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు అధిక ధర చెల్లించి పెట్రోల్ కొనుగోలు చేస్తుంటే, వారి వాహనాల్లో ఎక్కువ మొత్తంలో ఇథనాల్ నింపుతున్నారని రాహుల్ విమర్శించారు. దీనివల్ల వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. పెట్రోల్ బంకుల్లో ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో తెలిపే సమాచారం కూడా వినియోగదారులకు అందుబాటులో లేదని ఆరోపించారు.
Also Read:బండి సంజయ్‌పై దివ్యాంగుడి సంచలనం
ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి.. దేశవ్యాప్తంగా వాహనాల్లో నింపుతున్న పెట్రోల్‌లో వాస్తవంగా ఎంత ఇథనాల్ ఉంటోందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. 20 శాతం పరిమితిని దాటి ఇంధనాన్ని సరఫరా చేస్తున్న కంపెనీలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతోందనే అంశంపై చర్చకు రావాలన్న తన సవాల్‌ను కూడా రాహుల్ మరోసారి గుర్తుచేశారు.

