బండి సంజయ్‌పై దివ్యాంగుడి సంచలనం

1
- Advertisement -

కరీంనగర్‌లో ఓ వికలాంగుడు పురుగుల మందు తాగుతూ తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన చావుకైనా బీజేపీ నేతలు బాధ్యత వహించాలని శివ అనే వ్యక్తి వీడియోలో ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ వల్లే తాను ఈ పరిస్థితికి వచ్చానని పేర్కొంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.

వీడియోలో శివ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని కిసాన్ నగర్ రోడ్ నంబర్ 17లో తమ కుటుంబానికి ఇల్లు ఉంది. ఆ ఇంటిని కూల్చివేస్తామంటూ అధికారులు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తన అన్న బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాడని, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడని చెప్పారు. తాను పుట్టుకతోనే వికలాంగుడినని, పెయింటింగ్ పనులు చేస్తూ తన అవసరాలకు సరిపడా సంపాదించుకుంటున్నానని వెల్లడించారు.

ఎన్నికలకు ముందు బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ తమ ఇంటికి వచ్చి, బీఆర్ఎస్‌కు దూరంగా ఉండి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు శివ ఆరోపించారు. ఇందుకోసం తన అన్నకు రూ.4 లక్షలు ఇచ్చేందుకు ప్రయత్నించారని, అందుకు తమ కుటుంబం అంగీకరించలేదని తెలిపారు. తాను గెలిచిన తర్వాత మీ కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించినట్లు ఆరోపించారు.

ప్రస్తుతం కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత కావాలనే తమ ఇంటిని కూల్చేందుకు నోటీసులు ఇప్పించారని శివ ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్నకు తమ్ముడిగా ఎలాంటి సహాయం చేయలేకపోతున్నానని, అందుకే బండి సంజయ్ కళ్లు తెరిచి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.

సోమిడి వేణుప్రసాద్‌పై గతంలో హత్యాయత్నం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారనే ఆరోపణను కూడా బాధితుడు ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నేతల స్పందన తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

 

- Advertisement -