సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ సంస్థ యజమానురాలి ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని, ఆమె అకౌంటెంట్‌ను నమ్మించిన గుర్తుతెలియని వ్యక్తి ఏకంగా రూ.కోటి కాజేశాడు. అత్యవసరంగా డబ్బులు పంపించాలంటూ యజమానురాలి పేరుతో మెసేజ్ చేయడంతో అకౌంటెంట్ నిజమేనని భావించి నగదును బదిలీ చేశాడు. ఆ తర్వాత మరో రూ.2.5 కోట్లు పంపాలని కోరడంతో అసలు విషయం బయటపడింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 54లో నివసించే పెండ్యాల ఉషాలక్ష్మి (50) ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె విదేశీ పర్యటనకు వెళ్లే ముందు అత్యవసర అవసరాల కోసం రెండు ఖాళీ చెక్కులపై సంతకాలు చేసి తన అకౌంటెంట్ ఎం.వి.ఎ.ఎస్. కళ్యాణమూర్తికి అప్పగించారు.
ఈ నెల 3వ తేదీన ఉషాలక్ష్మి ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తి అకౌంటెంట్ కళ్యాణమూర్తికి మెసేజ్ పంపాడు. తానే సంస్థ యజమానురాలినని పరిచయం చేసుకుని, అత్యవసరంగా కోటి రూపాయలు పంపించాలని ఆదేశించాడు. ఇందుకోసం తన వద్ద ఉన్న సంతకం చేసిన చెక్కును ఉపయోగించాలని సూచించాడు. దీంతో ఆ మెసేజ్ నిజంగానే యజమానురాలు పంపిందని భావించిన కళ్యాణమూర్తి ఎలాంటి నిర్ధారణ చేసుకోకుండానే రూ.కోటిని బదిలీ చేశాడు.
Also Read:బండి సంజయ్‌పై దివ్యాంగుడి సంచలనం
కోటి రూపాయలు అందుకున్న తర్వాత నిందితుడు మరో రూ.2.5 కోట్లు పంపించాలని మెసేజ్ చేశాడు. దీంతో అకౌంటెంట్‌కు అనుమానం వచ్చింది. వెంటనే విదేశాల్లో ఉన్న ఉషాలక్ష్మిని సంప్రదించి విషయం చెప్పగా, తాను ఎలాంటి డబ్బులు అడగలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌లు నకిలీవని, తాము సైబర్ మోసానికి గురయ్యామని గుర్తించారు.
ఈ ఘటనపై అకౌంటెంట్ కళ్యాణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి వివరాలు, నగదు బదిలీ అయిన ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. యజమానుల పేరుతో వచ్చే వాట్సాప్ సందేశాలను నమ్మే ముందు ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

