అభిమానులకు ధనుష్ సారీ

1
- Advertisement -

తమిళ స్టార్ హీరో ధనుష్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తన తాజా చిత్రం ‘ఓం’ ఆడియో విడుదల వేడుకకు ఎంట్రీ పాస్‌లు ఉన్నప్పటికీ లోపలికి అనుమతి లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగిన అభిమానుల విషయంలో ఆయన స్పందించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

చెన్నైలోని సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజీలో నవంబర్ 6న ‘ఓం: చాప్టర్ 1 – ఉధిరం: ది బ్లడ్ వుడ్’ సినిమా ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన నటులను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో ముందుగానే ఎంట్రీ పాస్‌లు పొందారు. అయితే అభిమానుల సంఖ్య భారీగా పెరగడంతో వేదికలోకి అందరికీ ప్రవేశం కల్పించడం సాధ్యపడలేదు. దీంతో చేతిలో పాస్‌లు ఉన్నప్పటికీ పలువురు అభిమానులను లోపలికి అనుమతించలేదు. నిరాశతో వారు వెనుదిరగాల్సి వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న ధనుష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అభిమానులు టికెట్లు చేతిలో పెట్టుకుని కూడా కార్యక్రమానికి హాజరు కాలేక వెనుదిరగడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు ఎవరు కారణమనే విషయాన్ని పరిశీలించదలుచుకోలేదని, పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నానని తెలిపారు. ఇకపై ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవడం తన బాధ్యత అని స్పష్టం చేశారు.

Also Read:బండి సంజయ్‌పై దివ్యాంగుడి సంచలనం

ఇక ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ధనుష్‌తో పాటు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, నాజర్, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

ఆడియో వేడుకలో అభిమానులకు ఎదురైన అసౌకర్యంపై ధనుష్ స్వయంగా బాధ్యత తీసుకుని క్షమాపణలు చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -