బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక మరో ఫీట్ సాధించింది. 2017 సంవత్సరానికి గాను భారత్ తరపున అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితా టాప్ 10లో చోటు దక్కించుకుంది. 65.52కోట్ల రూపాయల పారితోషికంతో ప్రియాంక 8వ స్ధానంలో నిలిచింది.
కొలంబియా నటి సోఫియా వెర్గారా రూ.271.85కోట్ల ఆర్జనతో వరసగా ఆరో ఏడాదీ టాప్–10లో నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ నటి కేలీ కుకో రూ.170.39 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచారు. గ్రేస్ అనాటమీ నటీమణి ఎలెన్ పోంపియో రూ.85 కోట్ల సంపాదనతో మూడో స్థానం దక్కించుకున్నారు.
ఓ వైపు బాలీవుడ్లో సినిమాలు చేస్తూనే.. హాలీవుడ్లో ‘క్వాంటికో’ అనే టెలివిజన్ షోతో ప్రియాంక అలరించింది. ఈ షో మొదటి సీజన్ లోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక రెండు, మూడు సీజన్లలో కూడా ఆ క్రేజ్‌ని నిలబెట్టుకుంది.
గత ఏడాది జూన్ 1 నుండి ఈ ఏడాది జూన్ 1 వరకు ఈ షో ద్వారా ప్రియాంక అందుకున్న రెమ్యునరేషన్ 10 మిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. ఇందులో యాభై శాతం కంటే ఎక్కువ ఆమెకి వాణిజ్య ప్రకటనల్లో నటించడం ద్వారా లభించినట్లు సమాచారం. ఇటీవల ‘బేవాచ్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించిన ప్రియాంక ప్రస్తుతం ‘Isn’t it Romantic’ అనే మరో సినిమాలో నటిస్తోంది.