26వేల పోలీసు కొలువులు

228
26000 recruitments in police dept
- Advertisement -

పోలీసు శాఖలో 26,000 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ. అందులో 33 శాతం రిజర్వేషన్‌ ప్రకారం ఎనిమిది వేల ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేస్తామని వెల్లడించారు డీజీపీ.  రెండు దశల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఒకేసారి పెద్ద మొత్తంలో నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుందని, రెండుదశల్లో నియామకాలు జరిపితే సమస్య ఉండదని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. అంతేగాదు ప్రస్తుతం 11 వేల మంది సిబ్బంది శిక్షణలో ఉన్నారు. వారి శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రైనింగ్‌ కాలేజీలు బిజీగా ఉన్నాయి. 11 వేల మంది సిబ్బంది శిక్షణకే సమస్యలు ఎదురవుతున్నాయని, అలాంటిది ఒకేసారి 26 వేల పోస్టులు భర్తీ చేస్తే మరింత క్లిష్టంగా మారుతుందని భావిస్తున్నారు అధికారులు. దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోనుంది.

ఖాళీల ప్రక్రియను మొదలు పెట్టక ముందే అధికారులు పోలీసుస్టేషన్‌ల వారీగా యువతను సమీకరించి కానిస్టేబుల్ ఎంపిక కోసం కావాల్సిన తర్ఫీదును ప్రారంభించారు. ఇదే తరహాలో మహిళలకు కూడా తర్ఫీదును ప్రారంభించాలని నిర్ణయించారు.  గడిచిన రెండేళ్ళ కాలంలో పోలీసు శాఖలో దాదాపు 10 వేల మంది పదవీ విరమణ చేశారు. మరికొంత మంది కానిస్టేబుళ్ళకు హెడ్ కానిస్టేబుల్‌గా, హెడ్ కానిస్టేబుళ్ళకు ఎఎస్‌ఐలు, ఇలా పదవుల వారిగా పదోన్నతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.  క్షేత్ర స్థాయిలో సిబ్బంది కొరత కారణంగా అధికారులు పదోన్నతుల విషయంలో గడచిన మూడేళ్ళ కాలంలో దోబూచులాడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి పట్టుకొమ్మగా భావిస్తున్న పోలీసు శాఖలో అసహనానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

- Advertisement -