‘స్పిరిట్’ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది- ప్రభాస్

70
Prabhas for Spirit

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ తన 25వ సినిమాను సందీప్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ”స్పిరిట్” అనే టైటిల్‌తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఇప్పటి వరకు ప్రభాస్‌ను అభిమానులు కనీసం ఊహించనటువంటి సరికొత్త పాత్రలో సందీప్ రెడ్డి వంగా చూపించబోతున్నారని చిత్ర బృందం తెలిపారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీతో పాటుగా పలు విదేశీ భాషల్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. యూవీ క్రియేషన్స్ వారు ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఈ సినిమాను గురించి ప్రభాస్ మాట్లాడుతూ .. “25వ సినిమాగా ‘స్పిరిట్’ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన కథాంశం. ఈ సినిమాలోలా నన్ను చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ సినిమా కోసం పనిచేయడానికి ఎక్కువ కాలం వెయిట్ చేయలేను” అంటూ తన ఆసక్తిని .. ఆత్రుతను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే, ఈ కొత్త ప్రాజెక్టు మొదలవుతుంది. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.