బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ముంబై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పుడీ వార్త బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. కరీనా కపూర్ పై పోలీసులు ఎందుకు కేసు పెట్టారు? ఎవరు ఫిర్యాదు చేశారని అందరూ ఆరాతీస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. తమ మనోభావాలను కరీనా దెబ్బతీశారంటూ క్రిస్టియన్ సంఘాలు ఆమెపై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. వివరాల్లోకి వెళ్తే తన ప్రెగ్నీన్సీ అనుభవాలను ఆమె పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకానికి ఆమె ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ అనే పేరు పెట్టారు. ఈ టైటిల్పై క్రిస్టియన్ సంఘాలు మండిపడ్డాయి.
కరీనా కపూర్ పుస్తకానికి పెట్టిన టైటిల్ తమ పవిత్ర గ్రంథమైన బైబిల్ను అవమానించేలా ఉందని క్రిస్టియన్ సంఘాలు తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ, సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేయాలని అల్ఫా, ఒమేగా క్రిస్టియన్ మహాసంఘ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే తాము ఫిర్యాదు మాత్రమే తీసుకున్నామని, ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు చేయలేదని చెప్పారు. ఈ కేసు ముంబై పరిధిలోకి వస్తుందని, తమ పరిధిలోకి రాదని ఆయనకు చెప్పామని అన్నారు.