మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, ఇది భారతదేశ భవిష్యత్తును మార్చే ఒక చారిత్రాత్మక అడుగు అని అభివర్ణించారు.
ఈ బిల్లుతో దేశం ఒక కొత్త దిశలో పయనించబోతోందని ప్రధాని అన్నారు. వాస్తవానికి ఈ బిల్లు 25 నుండి 30 ఏళ్ల క్రితమే ఆమోదం పొందాల్సి ఉందని, ఇప్పుడు తన ప్రభుత్వ హయాంలో దీనిని ప్రవేశపెట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు.
పంచాయతీ నుండి పార్లమెంటు వరకు: మహిళలు ఇప్పుడు పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటుకు రావాలని కోరుకుంటున్నారని, వారి రాజకీయ ప్రాతినిధ్యం దేశాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు.
ఈ బిల్లును వ్యతిరేకించే వారు భవిష్యత్తులో ఎన్నికల పరంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని హెచ్చరించారు. దీనిని రాజకీయం చేయవద్దని ఆయన హితవు పలికారు. ఈ బిల్లు విజయం ఏ ఒక్క పార్టీకో లేదా మోదీకో దక్కే గౌరవం కాదని, ఇది భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే సమిష్టి నిర్ణయమని ఆయన అన్నారు.
అభివృద్ధి చెందిన భారత్ అంటే కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని, ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ మంత్రంతో మహిళలను నిర్ణయాధికారంలో భాగస్వాములను చేయడం అని మోదీ వివరించారు.
గత మూడు దశాబ్దాలుగా పంచాయతీల్లో పని చేస్తున్న మహిళల్లో గొప్ప రాజకీయ చైతన్యం వచ్చిందని, ఇప్పుడు వారు మౌనంగా ఉండే ప్రేక్షకులు కాదని ఆయన అన్నారు. ఈ సవరణ బిల్లు ప్రకారం లోక్‌సభలో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించబడతాయి.
లోక్‌సభ స్థానాల సంఖ్యను 815కి పెంచాలని ప్రతిపాదించారు. ఇందులో 273 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. 2023లో ప్రవేశపెట్టినప్పటికీ జాప్యం జరిగిన ఈ బిల్లును, ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా తక్షణమే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని, తన ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాని హామీ ఇచ్చారు.
Also Read:IPL:పంజాబ్ మ్యాచ్‌కు రోహిత్ దూరం

