దేశంలోని వందలాది చిన్న నగరాలను ఆర్థిక వృద్ధికి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నగరాలు కేవలం ప్రజలు నివసించే ప్రాంతాలు మాత్రమే కాదని, దేశ ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రాలని ఆయన పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు రంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మంగళవారం మహారాష్ట్రలోని పుణెలో సుమారు రూ.21,800 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుణె మెట్రో మూడో లైన్ (పింక్ లైన్)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌కు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ నిధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లను కేటాయించిందని, రానున్న సంవత్సరాల్లో దేశంలోని నగరాల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం దీని లక్ష్యమని చెప్పారు. స్థానిక సంస్థలు, ప్రైవేటు రంగ ప్రతినిధులు ముందుకు వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
Also Read:మంత్రి శ్రీధర్ బాబు vs ఎంపీ వంశీకృష్ణ
పుణె మెట్రో కొత్త లైన్‌తో నగరంలోని పాత, కొత్త ప్రాంతాల మధ్య రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని ప్రధాని తెలిపారు. హింజేవాడి ఐటీ కేంద్రం నుంచి శివాజీనగర్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. పుణె ఐటీ, ఆటోమొబైల్, ఔషధ, స్టార్టప్, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో కీలక కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు.

