తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మంత్రి శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ సభకు హాజరుకాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దంటూ మంత్రి శ్రీధర్‌బాబుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ లేఖలో ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో రాహుల్ గాంధీ నిర్వహించిన సభకు హాజరుకాలేదనే కారణంతో ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాకూర్, విజయరమణారావులపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవద్దని వంశీకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. గతంలో కాకా ట్రస్టు ఆధ్వర్యంలో ఓ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన సందర్భంలో మహిళా ప్రజాప్రతినిధితో పాటు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలపై సస్పెన్షన్ వేటు పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
పిల్లలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం నిర్వహించినందుకే అప్పట్లో వారిపై చర్యలు తీసుకున్నారని వంశీకృష్ణ వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. అదే విధంగా రాహుల్ గాంధీ నిర్వహించిన సభకు హాజరుకాని శ్రీధర్‌బాబు, మక్కన్ సింగ్ ఠాకూర్, విజయరమణారావులపై కూడా సస్పెన్షన్ చర్యలు తీసుకోవద్దని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు మంత్రి, ఎంపీ మధ్య రాజకీయ విభేదాలను మరోసారి బయటపెట్టినట్లయ్యాయి.
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఇప్పటికే స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాయకుల మధ్య వర్గపోరు మరింత ముదరడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగడం నష్టం కలిగిస్తుందని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
Also Read:క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్..
ఇప్పటికే జిల్లాలో పార్టీపై వ్యతిరేకత ఉందని భావిస్తున్న కార్యకర్తలు, ఈ అంతర్గత పోరు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అధిష్ఠానం జోక్యం చేసుకుని నాయకుల మధ్య విభేదాలకు ముగింపు పలుకుతుందా? లేక ఈ వివాదం మరింత ముదురుతుందా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.


